CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 07:48 PM
CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ, ఎంఎస్‌ఎంఈలో ప్రాజెక్టులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఢిల్లీ: నీతి ఆయోగ్ భేటీలో (NITI Aayog Meeting) ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Modi) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(శనివారం) ప్రత్యేకంగా కలిశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో రెండో దశకు కేబినెట్ అనుమతికి అవసరమైన చర్యలు వేగంగా తీసుకోవాలని, పట్టణాభివృద్ది శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి ఆర్థిక, కేబినెట్ అనుమతులు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఉత్తర భాగంతో పాటు.. దక్షిణ భాగానికి కూడా ఏకకాలంలో అనుమతుల ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగంలో భూసేకరణకు 50 శాతం వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా భరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ రైల్వేలైన్ నిర్మాణానికి కూడా సహకరించాలని కోరారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసే డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానిస్తూ.. గ్రీన్ ఫీల్డ్ రహదారితో పాటు... గ్రీన్‌ఫీల్డ్ రైల్వేలైన్ కూడా మంజూరు చేయాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌కు అనువైన, అవసరమైన భూమి తెలంగాణలో ఉందని, నైపుణ్యమైన మానవ వనరులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమని వివరించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ, ఎంఎస్‌ఎంఈలో ప్రాజెక్టులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఇందుకు అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. వచ్చే ఏడాది డిఫెన్స్ ఎక్స్‌పోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రక్షణ రంగ ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశం..
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశం రేపు (ఆదివారం) జరుగనుంది. అశోకా హోటల్‌లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి తాను హాజరుకావడం లేదని బీజేపీ పెద్దలకు సీఎం చంద్రబాబు సమాచారం ఇచ్చారు. ప్రధాని మోదీ మూడో టర్మ్‌లో ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సిందూర్, దేశభద్రత , కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Seethakka: అధికారులు ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం సహకరించాలి
KTR On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్ ఏమన్నారంటే
For More Telangana News and Telugu News..