Share News

CM Revanth Meets Film Celebrities: పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే సహించం: సీఎం రేవంత్

ABN , Publish Date - Aug 24 , 2025 | 09:03 PM

తమ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో చక్కటి పని వాతావరణం ఉండాలని సూచించారు. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Meets Film Celebrities: పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే సహించం: సీఎం రేవంత్
CM Revanth Reddy Meets Film Celebrities

హైదరాబాద్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): తెలుగు సినిమా పరిశ్రమ (Telugu Film industry) అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉద్ఘాటించారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని సూచించారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని చెప్పుకొచ్చారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే తమ ప్రభుత్వం సహించదని.. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


ఇవాళ(ఆదివారం) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు కలిశారు. వారితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, వంశీ, గోపీ, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.


సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం...

‘సినిమా పరిశ్రమలో చక్కటి పని వాతావరణం ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల విభాగంలో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహారించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్‌గా ఉంటా. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే నా ధ్యేయం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రేపు(సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ముఖ్యనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎల్లుండి(మంగళవారం) ఢిల్లీ నుంచి బిహార్‌ వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓట్ చోరీ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 09:16 PM