CM Revanth Reddy: హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:37 PM
ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలను తమ ప్రభుత్వంలో మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నామని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్,ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖను తమ ప్రభుత్వంలో మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉద్ఘాటించారు. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నామని వ్యాఖ్యానించారు. అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్థాయిలో సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా కార్యాలయాలు నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధింత మంత్రికి సూచించారు. 2034లోగా ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపు చూస్తోందని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆ స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. నగర అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువేనని.. అలాంటి దొంగల పని పట్టాల్సింది మీరేనని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ నగరం చారిత్రాత్మక నగరమని.. అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం గుర్తింపు పొందడానికి ఆనాటి కూలీ కుతుబ్ షాహీ నుంచి ఈనాటి పాలకుల వరకు ఎంతోమంది కృషి చేశారని గుర్తుచేశారు. వారి కృషి వల్లే ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా హైదరాబాద్‌కు కీర్తి ప్రతిష్టలు దక్కాయని నొక్కిచెప్పారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని ఉద్ఘాటించారు. తెలంగాణలోనూ హైటెక్ సిటీ అభివృద్ధికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని గుర్తుచేశారు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఇక్కడికి వచ్చాయంటే ఆనాటి ముఖ్యమంత్రుల దూరదృష్టినే కారణమని తెలిపారు. మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని కూడా కొంతమంది అవహేళన చేశారని అన్నారు. హైదరాబాద్ నగరానికి బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీ కాదని.. టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని ఉద్ఘాటించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ… అది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని నొక్కిచెప్పారు. మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని వివరించారు. గోదావరి జలాలను భాగ్యనగరానికి తీసుకువచ్చి 365 రోజులు మూసీలో నీరు ఉండేలా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహా భవనాలను నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే నగర అభివృద్ధితో పాటు నగర విస్తరణ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం బిల్లు.. సజ్జనార్ ఏమన్నారంటే..
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Read latest Telangana News And Telugu News