Mallu Bhatti Vikramarka: భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున కీలక భేటీ
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:25 PM
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు.
హైదరాబాద్, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో (Mallu Bhatti Vikramarka) సినీ నటులు చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna)లతో పాటు పలువురు ప్రముఖులు ఇవాళ(శనివారం) ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు భట్టి విక్రమార్క. తప్పకుండా వస్తామని చిరంజీవి, నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడారు భట్టి విక్రమార్క.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అనేది ఒక ఎకనామిక్ సమ్మిట్ అని వివరించారు. ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అంత కలిసి కూర్చొని విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఈ సమ్మిట్ ప్రారంభమవుతుందని తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖ ఎకానమిస్ట్‌లు ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే తనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సెషన్స్ ఉంటాయని వివరించారు. ఆయా డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన కార్యక్రమాలను మంత్రులు చూసుకుంటారని చెప్పుకొచ్చారు.
ఈ సమ్మిట్‌లో అనేక మంది ఎక్స్‌పర్ట్స్ పాల్గొంటారని వివరించారు. 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ సెర్మనీ ఉంటుందని తెలిపారు. ఈ సెర్మనీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మళ్లీ తెలియచేస్తామని తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 డెలిగేట్స్ వస్తున్నారని వివరించారు. అమెరికా నుంచే 46మంది ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. స్వయంగా అధికారులు వెళ్లి ఆఫీషియల్‌గా పిలుస్తారని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్
Read Latest Telangana News and National News