EC On Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎన్నికల కమిషన్ కీలక సూచనలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:52 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పలు కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills Bye Poll) మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ (RV Karnan) తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉన్నారని.. ఇందులో పురుషులు- 2,08,561, మహిళలు- 1,92,779, ఇతరులు- 25 మంది ఉన్నారని వెల్లడించారు. ముగ్గురు అబ్జర్వర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
బ్యాలెట్ యూనిట్‌లో అభ్యర్థుల కలర్ ఫొటో ఉంటుందని వివరించారు. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఉంటుందని తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఓటు వేసే వారు అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పోలింగ్ స్టేషన్‌కి వెళ్లాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ లోపలికి ఓటర్లకు, ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
15 FST, 15 SST టీమ్స్ నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.2 కోట్ల 83 లక్షల నగదు పట్టుకున్నామని ప్రకటించారు. 512 లీటర్ల మద్యం సీజ్ చేశామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంపై తాము నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. ఈవీఎంలు సరిపోనూ ఉన్నాయని.. 20 శాతం ఈవీఎంలు అదనంగా ఉన్నాయని వివరించారు. ఓటర్ స్లిప్పులు స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు పంచుతారని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు ఓటర్ స్లిప్పులు పంచితే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు.
జూబ్లీహిల్స్‌కి 27న పారా మిలిటరీ బలగాలు :తఫ్సీర్ ఇక్బాల్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈనెల(అక్టోబరు) 27వ తేదీన పారా మిలిటరీ బలగాలు వస్తున్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ (Tafseer Iqbal) తెలిపారు. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పని చేస్తాయని వెల్లడించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క వార్నింగ్
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News