Minister Seethakka Review ON Anganwadi: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క వార్నింగ్
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:08 PM
కేసీఆర్ గత ప్రభుత్వంలో మాదిరిగా సరకుల సప్లైయర్స్ వ్యవహారిస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి సీతక్క ఆజ్ఞాపించారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ (Anganwadi) కేంద్రాలకు సరకుల సరఫరా నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల(DWO)తో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క ఇవాళ (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనే, బాలామృతం, మురుకులు, బియ్యం సరఫరాపై జిల్లాల వారిగా మంత్రి సీతక్క సమీక్ష చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల ప్రగతిని మంత్రి సీతక్క సమీక్షించారు.
పలు జిల్లాల్లో సరకుల సరఫరా ఆశించిన మేర లేకపోవడంపై కాంట్రాక్టర్లపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మాదిరిగా సరకుల సప్లైయర్స్ వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆజ్ఞాపించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకారం అందించడంలో రాజీ పడేది లేదని మందలించారు. లబ్ధిదారులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హుకుం జారీ చేశారు. చిన్నారుల సంరక్షణ విషయంలో అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు.
చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన సమయం నుంచి వారు వెళ్లే వరకు సిబ్బంది బాధ్యత వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్, తాగు నీటి సదుపాయం, టాయిలెట్ సౌకర్యాల కల్పన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య, హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల కనీసం ఒక చిన్నారి చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి సీతక్క.
ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయనే భరోసాను తల్లిదండ్రులకు కల్పించాలని మంత్రి సూచించారు. జిల్లా అధికారులు ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్టులు పంపించాలని ఆజ్ఞాపించారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని సూచించారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి బాల్య వివాహాలు జరుగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రి సీతక్కతోపాటు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News