Kurnool Bus Tragedy: పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:36 AM
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారి తల్లి ఫిలో మినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: ఆ ఇద్దరు తల్లీకొడుకులు పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చారు. దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బంధువులతో సరదాగా గడిపారు. ఎంతో సంతోషాలను పంచుకుని తిరిగి వారింటికి పయనమయ్యారు ఇద్దరు. కానీ అదే వారికి చివరి జర్నీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో తల్లి ఫిలో మినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు. తల్లీ కొడుకులు ఇద్దరూ కూడా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. దీపావళి పండగ నిమిత్తం బెంగళూరు నుంచి కూతురు పద్మ వద్దకు తల్లి ఫిలో మినన్ బేబీ వచ్చింది. పండగ అనంతరం తల్లిని తీసుకువెళ్లడానికి బెంగళూరు నుంచి కుమారుడు కిషోర్ కుమార్ పటాన్‌చెరుకు వచ్చారు. తల్లితో కలిసి బెంగళూరు వెళ్లేందుకు గత రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పటాన్‌చెరులో కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. కానీ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లీకొడుకులు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. బస్సు ప్రమాదం తెలిసి కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఒకేసారి తల్లీ, సోదరుడిని కోల్పోవడంతో ఆమె గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.
ఇవి కూడా చదవండి...
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
Read Latest Telangana News And Telugu News