Hyderabad Bangalore Bus fire accident: బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:32 AM
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. ఆ ట్రావెల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రావెల్స్‌కు సంబంధించి కార్యాలయాలు అన్నింటిని మూసివేసింది. ఈ ఘోర ఘటన జరిగినప్పటికీ వి కావేరి ట్రావెల్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో రెండు రాష్ డ్రైవింగ్ చలానాలు విధించినట్లు సమాచారం.
ఇక ఈ ప్రమాదం జరిగిన బస్సులో కూకట్‌పల్లి నుంచి ఏడుగురు ప్రయాణికులు ఎక్కినట్లు సమాచారం. ఈ ప్రయాణికుల్లో హర్ష, రామిరెడ్డి, సూర్య ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ధాత్రి, చందన, మంగా, అమృత్ కుమార్‌ల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. ఇక సూరారం నుంచి ఈ బస్సు ఎక్కిన గుణ సాయి సైతం క్షేమం ఉన్నారు.
అలాగే బహదూర్‌పల్లిలో ఈ బస్ ఎక్కిన ప్రశాంత్ ఫోన్ సైతం రీచ్ కావడం లేదు. ఇదే ప్రాంతం నుంచి ఈ బస్సు ఎక్కిన సుబ్రహ్మణ్యం సురక్షితంగా ఉన్నారు. అదే విధంగా గండిమైసమ్మ చౌరస్తా వద్ద బస్సు ఎక్కిన సత్యనారాయణ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుస్తుంది. చింతల్‌లో బస్సు ఎక్కిన వేణు గుండాల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం. దీంతో ఆయా కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 12 మంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. బస్సును బైక్ ఢీకొట్టి ముందుభాగంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
For More TG News And Telugu News