Kurnool Bus Accident: బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:06 AM
కర్నూలు జిల్లాచిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి.. అందుకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఉన్నతాధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో భాగంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలంటూ గద్వాల్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీలను సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
స్పందించిన కేటీఆర్..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మంది దుర్మరణం చెందడం తనను కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరక తన ఎక్స్ ఖాతా వేదికగా కేటీఆర్ తెలిపారు.
కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 12 మంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. బస్సును బైక్ ఢీకొట్టి ముందుభాగంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
ఇక బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు
For More TG News And Telugu News