Government Allows Up to Four Nominees: ఇక బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:24 AM
బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక ఒక్కో బ్యాంకు ఖాతాపై డిపాజిటర్లు నలుగురి వరకు తన నామినీలుగా నామినేట్ చేయవచ్చు. సవరించిన ఈ నిబంధనలు నవంబరు 1 నుంచే అమల్లోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ...
లాకర్లకూ ఇదే నిబంధన
నవంబరు 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక ఒక్కో బ్యాంకు ఖాతాపై డిపాజిటర్లు నలుగురి వరకు తన నామినీలుగా నామినేట్ చేయవచ్చు. సవరించిన ఈ నిబంధనలు నవంబరు 1 నుంచే అమల్లోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిపాజిటర్లు ఈ నామినీల పేర్లను ఒకేసారి లేదా దఫదఫాలుగా పేర్కొనవచ్చు. అలాగే తన తదనంతరం బ్యాంకులోని తన డిపాజిట్‌లో ఏ నామినీకి ఎంత? లేదా ఎంత శాతం ఇవ్వాలో కూడా పేర్కొనవచ్చు. బ్యాంకు లాకర్లకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త నిబంధనలతో డిపాజిటర్ల తదనంతరం సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత సులభం అవుతుందని భావిస్తున్నారు.
చెక్కుల క్లియరెన్స్‌లో ఇంకా బాలారిష్టాలు: ఎన్‌పీసీఐ
ఈ నెల 4వ తేదీ నుంచి ప్రవేశపెట్టిన సత్వర చెక్కుల క్లియరెన్స్‌లో ఇంకా కొన్ని బాలారిష్టాలు కొనసాగుతున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. వీటిని కూడా అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. గతంలో చెక్కుల క్లియరెన్స్‌కు రెండు మూడు రోజుల సమయం పట్టేది. చెక్ ప్రజెంట్ చేసిన కొన్ని గంటల్లో అదే రోజు క్లియర్ చేసేలా చెక్ ట్రంకేటెడ్ సిస్టమ్ (సీటీసీ) పేరుతో ఆర్‌బీఐ ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త విధానం ప్రవేశ పెట్టింది. అయితే సాంకేతిక సమస్యలు, బ్యాంకు సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో చెక్కుల క్లియరెన్స్‌కు ఐదారు రోజులు పడుతోంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం.
డిజిట్ చెల్లింపులు అదుర్స్
దేశంలో డిజిటల్ చెల్లింపులు శరవేగంతో విస్తరిస్తున్నాయి. 2019లో రూ.1,775 లక్షల కోట్ల విలువైన 3,248 కోట్ల లావాదేవీలు నమోదవగా, గత ఏడాది (2024) మొత్తం మీద రూ.2,830 లక్షల కోట్ల విలువైన 20,849 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. శాతంపరంగా చూస్తే గత ఏడాది నమోదైన మొత్తం చెల్లింపుల లావాదేవీల్లో 99.7 శాతం డిజిటల్ చెల్లింపులని ఆర్‌బీఐ తెలిపింది. విలువపరంగా చూసినా ఈ చెల్లింపుల వాటా మొత్తం చెల్లింపుల్లో 97.5 శాతం వరకు ఉంది. కాగా ఈ ఏడాది (2025) తొలి ఆరు నెలల్లోనూ ఇదే పరిస్థితి. నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, ఎన్‌ఏసీహెచ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్, యూపీఐ వంటి చెల్లింపులన్నీ డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి వస్తాయి. వ్యాపార, వ్యక్తిగత చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలు శరవేగంతో పెరుగుతుంటే, పేపర్ ఆధారిత చెక్కుల చెల్లింపుల వాటా ఇదే సమయంలో మొత్తం చెల్లింపుల్లో 2.3 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనూ దేశంలో రూ.1,572 లక్షల కోట్ల విలువైన 12,549 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదయ్యాయి.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి