Share News

Rohit-Virat: రో-కో ఇక్కడే ఉంటారు: అరుణ్ ధుమాల్

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:56 AM

భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రానున్న వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతారా? అనే ప్రశ్నపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని.. వారు ఇక్కడే ఉంటారని తెలిపారు. రో-కో వారి జీవితాన్ని భారత క్రికెట్‌కు అంకితం చేశారని అన్నారు.

Rohit-Virat: రో-కో ఇక్కడే ఉంటారు: అరుణ్ ధుమాల్

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడుతారా? ప్రస్తుతం అందరిలో నెలకొన్న వంద డాలర్ల ప్రశ్న ఇది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శనలే చేశారు. రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీ, హాఫ్ సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రో-కో.. మళ్లీ సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడరు. రానున్న వన్డే ప్రపంచ కప్(2027 ODI World Cup) వరకూ కెరీర్‌ను కొనసాగించాలనేది వారి అభిమతం కాగా.. అభిమానుల ఆకాంక్ష కూడా ఇదే. కానీ మేనేజ్‌మెంట్ వారికి అవకాశాలు ఇస్తుందా? అనేది కూడా ఓ సందిగ్ధతే. ఈ క్రమంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్(Arun Dhumal) దృష్టికి రో-కో భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న వచ్చింది.


‘చాలా కాలంగా భారత రిజర్వ్ బెంచ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడీ టీమిండియాను చూడండి.. ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) జట్టులో తన ప్లేస్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు చాలామంది రోహిత్, విరాట్ రిటైర్ అవుతారనే అనుకుంటారు. కానీ వారెక్కడికీ వెళ్లరు.. ఇక్కడే ఉంటారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ ఆటను చూశాం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. భారత్‌కు తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించేందుకు వీరిద్దరు ఏ మాత్రం వెనుకాడరు. వారి జీవితం భారత క్రికెట్‌కు అంకితం చేశారు’ అని అరుణ్ ధుమాల్ వ్యాఖ్యానించారు.


మినీ వేలం అప్పుడే..!

ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్‌కు సంబంధించి మినీ వేలం(Mini Auction) వచ్చే నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు అధికారికంగా బీసీసీఐ(BCCI) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. గత రెండేళ్లు ఈ వేలం విదేశాల్లోనే జరిగిన విషయం తెలిసిందే. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియా వేదికగా వేలం నిర్వహించారు. ఇప్పుడు స్వదేశంలోనే నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 13-15 తేదీల్లో ఐపీఎల్ మినీ వేలం జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. రిటైన్ లిస్ట్‌తో పాటు వదిలేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసే పనిలో ఫ్రాంచైజీలు బిజీగా ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..

Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్

Updated Date - Nov 01 , 2025 | 11:56 AM