Share News

Bengaluru: ప్రీ నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలా? ఇదెక్కడి దోపిడీరా బాబోయ్..!

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:37 PM

చదువుకోవడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హక్కును పూర్తిగా కాలరాస్తున్నాయి. ఫీజుల పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పిచేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మరో ఉదంతం బయటకు వచ్చింది. చదువు'కొనిపించడమే' ధ్యేయంగా ముందుకెళ్తు్న్న ఓ విద్యాసంస్థ దోపిడీపై బెంగళూరు వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Bengaluru: ప్రీ నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలా? ఇదెక్కడి దోపిడీరా బాబోయ్..!
Bengaluru Man Outraged Over Rs.1.85 Lakh Nursery Fee

ప్రైవేటు స్కూళ్లల్లో చదివిస్తేనే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తపించే తల్లిదండ్రుల బలహీనతను ప్రైవేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. విద్య అనే పదానికి పూర్తిగా అర్థం మార్చేస్తూ ఆర్థిక దోపిడీకి మార్గంగా మలుచుకుంటున్నాయి. విద్యాసంస్థలు చదువు పేరిట చేస్తున్న వ్యాపారాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు ఎంత అలసత్వం ప్రదర్శిస్తున్నాయో ఈ ఘటనే నిదర్శనం. మాటలు కూడా సరిగా రాని వయసులో ఉన్న పిల్లలకు బెంగళూరులోని ఓ స్కూల్ లక్షన్నరకుపైగా ఫీజు వసూలు చేస్తోందంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రీ నర్సరీ విద్యార్థులు రూ.1.85 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి దోపిడీ అంటూ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది.


కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై మోపుతున్న ఫీజుల భారాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేధావులు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. మేం చదువు చెప్తే ఎవరికైనా టాప్ ర్యాంకులు ఖాయమంటూ తల్లిందండ్రుల మోసపూరిత ప్రకటనలతో మభ్యపెడుతూ విద్యను పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చేస్తున్నాయి చాలా విద్యా సంస్థలు. ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. తాజాగా బెంగళూరులోని ఓ పాఠశాల ఛార్జ్ చేస్తున్న ఫీజులను హైలైట్ చేస్తూ ఓ రెడ్డిట్ వినియోగదారు చేసిన పోస్ట్ భారతదేశ విద్యా వ్యవస్థ స్థితిగతుల గురించి మరోమారు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సదరు పాఠశాల్లో ప్రీ-నర్సరీ చదవాలంటే సంవత్సరానికి దాదాపు రూ. 1.85 లక్షలు చెల్లించాలని అతడు లెక్కలతో సహా ఓ చీటీ షేర్ చేశాడు.


వైరల్ అవుతున్న ఆ పోస్టులోని వివరాలు ఇలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.5000, కన్స్యూమబుల్స్ కింద రూ.28,240 గా ఉంది. అలాగే, టర్మ్-1 కింద జూన్- నవంబర్ మధ్య కాలానికి చెల్లించాల్సిన ఫీజు రూ.91,200. టర్మ్-2లో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకూ చెల్లించాల్సిన మొత్తం రూ.60,800. మొత్తంగా ఓ ఏడాదికి సుమారు రూ.1.85 లక్షలుగా ఉంది.


ప్రీ-స్కూల్ ఫీజు ఈ స్థాయిలో వసూలు చేయడం సమంజసమేనా? మీ ఆలోచనలు ఏమిటి, ప్రీ-స్కూల్ కు కచ్చితంగా అయ్యే ఖర్చు ఎంత? అని ప్రశ్నించాడు. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. కనీసం మీలో ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరా? అని నెటిజన్లను కోరాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నా చదువు మొత్తానికి కూడా ఇంత ఖర్చుచేయలేదని.. కిండర్ గార్డెన్ కోసం మరీ ఇంత ఫీజు వసూలు వసూలు చేస్తున్నారా? ఓ యూజర్ విస్మయం వ్యక్తం చేశాడు. ఇంకొకతను నా మేనకోడలికి అయితే ఏకంగా రూ.4-5 లక్షలు. కాబట్టి, ఇది కాస్త తక్కువే అని రాసుకొచ్చాడు. విద్యాసంస్థలపై ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని.. పరిమితం చేయకపోతే చదువు ధనవంతులకు మాత్రమే అనే పరిస్థితి వస్తుందనే ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


ఇవి కూడా చదవండి

భార్య ఘాతుకం.. అశ్లీల రీల్స్ చేయొద్దన్నాడని భర్తపై కత్తితో దాడి..

అసెంబ్లీలో గొడవ.. కొట్టుకున్న ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2025 | 01:39 PM