Shashi Tharoor: అమెరికాపైనా 50 శాతం సుంకం విధించాలి: శశిథరూర్
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:54 PM
రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ట్రంప్ అమెరికాపై 50 శాతం సుంకం విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అగ్రరాజ్యానికి ప్రతీకార సుంకాలతోనే బదులు ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) అమెరికా తీసుకుంటున్న ఆర్థిక చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్నదనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) భారత ఎగుమతులపై 50 శాతం వరకు దిగుమతి సుంకాలు (Trump Tariffs on India) విధించడం అన్యాయమని ఆయన విమర్శించారు. నిజానికి, చైనా భారతదేశం కంటే ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందని.. కానీ వాళ్లకు మాత్రం ట్రంప్ మినహాయింపు ఇచ్చిందని థరూర్ విమర్శించారు. భారతదేశంపై చైనా కంటే అధిక సుంకాలు విధిస్తూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో భారతీయ ఉత్పత్తుల కొనుగోళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతులపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. 'మన దేశం దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అలాంటి సమయంలో అధిక దిగుమతి సుంకాలు విధిస్తే, మన ఉత్పత్తులను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. ఎందుకు కొనుగోలు చేయాలని ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. చైనా రష్యా నుంచి భారత్ కన్నా ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. అమెరికా ఆ దేశానికి 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చిందని.. కానీ భారతదేశానికి మాత్రం కేవలం 21 రోజుల గడువు మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు. ఇది పూర్తిగా అసమంజసమని విమర్శించారు.
కేంద్రం కూడా అమెరికా దిగుమతులపై 50 శాతం సుంకం విధించడంపై ఆలోచించాలని ఎంపీ శశి థరూర్ సూచించారు. ఇతర దేశాల బెదిరింపులకు లోనవకుండా భారత్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇదేనని అన్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం 25 శాతం సుంకాలు విధించగా, తాజాగా మరో 25 శాతం పెంచి మొత్తం 50 శాతానికి తీసుకెళ్లింది. ఈ నిర్ణయాలు భారత వస్త్ర పరిశ్రమ, మత్స్య ఉత్పత్తులు, తోలు రంగాలపై తక్షణ ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందిస్తూ, రైతుల ప్రయోజనాలను ఎప్పుడూ కాపాడుతామని.. ఏ స్థాయిలోనైనా తాము తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read:
EVMలపై అనుమానాలు ఉన్నాయి..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల కమిషన్‌పై రాహుల్ బాంబు..?
For More National News and Telugu News..