Share News

Nethanna Bharosa: ఏడాదికి రూ.25 వేలు.. నేతన్నలకు చంద్రన్న భరోసా..!

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:56 PM

చేనేత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొత్త పథకం గురించి ప్రకటించారు. 'నేతన్న భరోసా' పథకం కింద చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని వెల్లడించారు.

Nethanna Bharosa: ఏడాదికి రూ.25 వేలు.. నేతన్నలకు చంద్రన్న భరోసా..!
Nethanna Bharosa Scheme

అమరావతి: చేనేత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త పథకం గురించి ప్రకటించారు. 'నేతన్న భరోసా' పథకం కింద చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని వెల్లడించారు. ఈ నెల నుంచి చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.


వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడేది చేనేత పరిశ్రమ పైనే అని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక అయిన మన చేనేత పరిశ్రమ భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. చిన్నవయసులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తొలిసారి నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చామని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీ చేనేత కార్మికుల కోసం పోరాటం చేసిందని గుర్తుచేశారు.


రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ తనకు మొట్టమొదట గుర్తుకువచ్చేది చేనేత కార్మికులేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేతన్నలు నేసే బట్టలపై ఐదు శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశానని ఆయన వెల్లడించారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని.. తద్వారా వెంకటగిరి, మంగళగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడల్లో 1374 మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో త్వరలోనే హ్యాండ్ లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆదరణ 3 కింద మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్లు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు

మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం

For More AP News and Telugu News

Updated Date - Aug 07 , 2025 | 04:06 PM