Idli vs Dosa: ఇడ్లీ vs దోశ.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ ఛాయిస్..!
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:42 AM
ఉదయం అల్పాహారంలో కొందరు ఇడ్లీ తినేందుకు ఇష్టపడితే.. మరికొందరికేమో దోశంటే ప్రాణం. అయితే, చాలామంది నూనెతో చేసిన దోశ కంటే ఆవిరిపై ఉడికించి తయారుచేసిన ఇడ్లీనే బటర్ అని వాదిస్తుంటారు. ఇంతకీ, అసలు నిజమేంటి? వేగంగా బరువు తగ్గేందుకు ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫుడ్?
దక్షిణ భారతదేశ ప్రజల రోజూవారీ అల్పాహారాల్లో ఇడ్లీ లేదా దోశ కచ్చితంగా ఉంటాయి. నిజానికి రెండూ పులియబెట్టిన పిండితో తయారుచేసినవే. అయితే, ఆకృతి, రుచిలో కాస్త భిన్నంగా ఉంటాయి. పూర్తిగా ఆవిరిపై ఉడికించిన ఇడ్లీ మెత్త మెత్తగా.. తెల్లగా మల్లెపువ్వులా మెరిసిపోతే.. ఇందుకు భిన్నంగా పెనంపై నూనెతో కాల్చిన దోశలు క్రిస్పీగా, కలర్‌ఫుల్ గా నోరూరిస్తూ ఉంటాయి. రుచిలోనూ దేని ప్రత్యేకత దానిదే. కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ బెస్ట్ అంటే.. దోశ ప్రియులేమో దోశనే గ్రేట్ ఫుడ్ అంటారు. ఇంతకీ ఈ రెండింటిలో హెల్తీ ఫుడ్ ఏదో చూద్దాం.
ఇడ్లీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కొవ్వు తక్కువ: ఇడ్లీలను ఆవిరి మీద ఉడికించి వండుతారు. దీని తయారీకి నూనె అవసరం లేదు. అందువల్ల సహజంగానే కొవ్వు తక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత కడుపుకు తేలికగా ఉంటుంది.
పేగు ఆరోగ్యానికి మంచిది: పులియబెట్టిన పిండితో చేసే ఇడ్లీలు ప్రక్రియ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పోషకాల శోషణను పెంచుతుంది. అన్ని వయసుల వారికి ఇడ్లీలను ఆరోగ్యకరమైన ఎంపిక.
జీర్ణం కావడం సులభం: ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. ఇవి తేలికపాటి అల్పాహారానికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యాయామం తర్వాత తినేందుకు బెస్ట్ ఫుడ్. ఇవి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలిగించకుండా అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తాయి.
మధుమేహం: తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇడ్లీ మంచి ఎంపిక. ఇడ్లీలోని కిణ్వ ప్రక్రియ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలను తగ్గిస్తుంది.
దోశ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కడుపు నిండిన భావన: దోశలు తిన్న తర్వాత కడుపు నిండినట్లుగా అనిపించడమే కాక సంతృప్తిగానూ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్-రిచ్ లేదా ఫైబర్-రిచ్ ఫిల్లింగ్‌లతో కలిపి తీసుకుంటే. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారి ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.
విభిన్న పోషకాల కలయిక: దోశల్లో వివిధ రకాలు ఉంటాయి. వీటి తయారీకి వివిధ రకాల కూరగాయలు, ప్రోటీన్లను జోడించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైనన్ని పోషకాలతో తయారుచేసుకునే సౌలభ్యం ఉంటుంది.
స్థిరమైన శక్తి: దోశలు అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇది అల్పాహారం లేదా వ్యాయామానికి ముందు తింటే స్థిరమైన శక్తి లభిస్తుంది. ఇతర ఆహారపదార్థాలతో పోలిస్తే మంచి ఎంపిక.
ఇడ్లీ లేదా దోశల్లో ఏది బెస్ట్?
ఇడ్లీ, దోశల్లో ఏది ఎంచుకోవాలనే ప్రశ్న వస్తే, అది ఆయా వ్యక్తుల ఆరోగ్యకర స్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కడుపుకు మృదువుగా ఉండే తేలికైన, తక్కువ కొవ్వు భోజనం కోసం చూస్తున్నట్లయితే ఇడ్లీ తినడం మంచిది. అలాకాక, కడుపు నిండిన అనుభూతి, రుచి రెండూ కావాలని కోరుకునేవారికి తక్కువ నూనెతో చేసిన దోశ బెస్ట్ ఛాయిస్. ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీలతో కలిపి తింటే ఇడ్లీ, దోశ రెండూ పోషకాహారాలే అంటున్నారు డైటీషియన్లు. అయితే, అధిక నూనెలతో తయారైన దోశలు ఆరోగ్యానికి ఏ మాత్రం లాభం చేకూర్చవని గుర్తుంచుకోవాలి. ఇక ఇడ్లీ లేదా దోశ రెండూ మితంగా తీసుకుంటే బరువు తగ్గించుకునేందుకు కచ్చితంగా ఉపయోగపడతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
7 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి షాకింగ్
గోధుమ లేదా జొన్న రోటీ.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?