Sleep Deprivation: 7 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి షాకింగ్ న్యూస్..!
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:29 AM
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మానసిక చికాకు మాత్రమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా రోజూ 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర కోసం తగినంత సమయాన్ని కేటాయించకపోతే శారీరకంగానూ, మానసికంగానూ వివిధ అనారోగ్యాలను ఆహ్వానిస్తున్నట్లే లెక్క. ఎందుకంటే నిద్రాభంగం మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. గుండె, కడుపు సంబంధిత సమస్యలకూ ఇవే కారణమని తేలింది. అంటే ఇలాంటి ప్రాణాంతక సమస్యలను నివారించడం మన చేతుల్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. డైలీ క్రమం తప్పకుండా 7 నుండి 8 గంటల నిద్ర పోయేందుకు ప్రయత్నించాలి. ఇంతకీ సరైన నిద్ర లేకపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది? ఏ వ్యాధులు వచ్చే అవకాశముందో ఈ కథనంలో తెలుసుకోండి.
నిద్రలేమి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు
1.మెదడు సమస్యలు
రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోని వ్యక్తులు క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా ఉందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, తగినంత నిద్ర లేకపోవడం మీ మెదడును దెబ్బతీస్తుంది. ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది.
2.మలబద్ధకం
నిద్ర లేకపోవడం జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కొంటారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే పేగుల్లో అవరోధం ఏర్పడి తీవ్రమైన పరిస్థితులు రావచ్చు.
3.జ్ఞాపకశక్తి బలహీనం
శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది.
4.మానసిక ఆరోగ్యం క్షీణత
నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో శక్తి, బలం తగ్గుతుంది. ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తుంది. అంతే కాదు. నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది ఒక వ్యక్తిలో చిరాకు, కోపాన్ని పెంచుతుంది. ఇవన్నీ మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సరిగ్గా నిద్రపోనప్పుడు మొదట ఈ లక్షణమే కనిపిస్తుంది.
5.కంటి ఆరోగ్యానికి దెబ్బ
నిద్ర లేమి కళ్ళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి శరీరంలో పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు లేదా మచ్చలు కనిపిస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
రాత్రిళ్లు 9 గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందా
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ