9 Hour Sleep: రాత్రిళ్లు 9 గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందా
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:22 PM
రాత్రి వేళ నిద్రపోయే సమయం 7 - 9 గంటల మధ్య ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ సేపు నిద్రపోతే భవిష్యత్తులో రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాత్రిళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. ఈ అంశం ఆయా వ్యక్తుల శరీర తత్వంపై కూడా ఆధారపడి ఉంటుందని కొందరు చెబుతున్నారు. పని హడావుడిలో కొందరు రాత్రి కనీసం ఐదు గంటలు కూడా నిద్రపోరు. రాత్రిళ్లు గరిష్టంగా 7 గంటలకు మించి నిద్రపోకూడదని కొందరు సూచిస్తే 9 గంటల నిద్రతో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఇంకొందరు వాదిస్తారు. మరి ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
నిపుణులు చెప్పేదాని ప్రకారం, రాత్రివేళ ఏడు గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవాలి. అయితే, నిద్ర సమయం 9 గంటలకు మించకూడదు. దీని వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతకుముందు రోజు నాటి అలసట నుంచి శరీరం పూర్తిగా కోలుకుంటుంది. అయితే, వ్యక్తులు తమ శరీర తత్వాన్ని బట్టి కూడా నిద్రవేళల్లో మార్పులు చేసుకోవాలి. 65 ఏళ్లు పైబడిన వారికి కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం. యువతకు 7-9 గంటల నిద్ర కావాలి. కొందరికీ ఆరోగ్యం కోసం ఏకంగా 9 గంటల నిద్ర అవసరమని కూడా డాక్టర్లు చెబుతారు. అయితే, నిద్ర సమయంతో పాటు నిద్రలో నాణ్యత కూడా ముఖ్యమేనని వైద్యులు చెబుతారు.
అధిక ఒత్తిడి, రాత్రిళ్లు పదే పదే మెళకువ రావడం, నిద్రకు అనుకూలంగా వాతావరణం లేకపోవడం వంటివన్నీ నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. మరుసటి రోజంతా అలసటతో గడపాల్సి వస్తుంది. క్రీడాకారుల నుంచి స్టూడెంట్స్ వరకూ అందరూ 7 గంటలకు పైబడి నిద్రపొతే పూర్తి ప్రయోజనాలు సిద్ధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే తక్కువ సేపు నిద్రపోతే మాత్రం అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, నిద్ర విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. రోజూ 7 గంటలకు పైబడి పూర్తిస్థాయిలో నిద్రపోయేలా షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవాలి. జీవనశైలిని మార్చుకోవాలి. దీంతో, ఆరోగ్యం పదికాలాల పాటు నిలిచి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..