Kidney Damage: కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:02 AM
కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు రాత్రి వేళ కొన్ని సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మార్పులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కిడ్నీ సమస్య మొదలవగానే శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. అయితే, రాత్రిళ్లు కనిపించే కొన్ని సమస్యలు కిడ్నీ వ్యాధికి ప్రధాన సంకేతాలని వైద్యులు చెబుతున్నారు.
రాత్రిళ్లు కనిపించే మార్పులు..
శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. శరీరంలోని విషతుల్యాలను తొలగించి, రక్తంలోని నీరు, ఎలక్ట్రొలైట్‌లు మధ్య సమతౌల్యం పాటించడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర. కిడ్నీల పనితీరు మందగిస్తే ఈ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ముఖ్యంగా రాత్రిళ్లు కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి.
కిడ్నీ సమస్య ఉన్న వాళ్లల్లో రాత్రి వేళ మూత్ర విసర్జన పెరుగుతుంది. పలుమార్లు వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. కిడ్నీ డ్యామేజ్ అయ్యిందనేందుకు ఇదో ముఖ్య సంకేతం.
కిడ్నీలు డ్యామేజ్ అయిన పక్షంలో ఒంట్లో సోడియం బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో, మడమలు, పాదాల్లో నీరు పేరుకుని వాపు మొదలవుతుంది. చేతుల్లోనూ ఈ వాపు కనిపిస్తుంది. రాత్రి వేళ ఈ వాపులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో కిడ్నీలు ఇబ్బంది పడుతుంటే చర్మంపై ఆ ప్రభావం కనిపిస్తుంది. రాత్రి వేళ చర్మంపై దురదలు, పాదాల్లో మంటలు వస్తాయి.
శరీరంలో పేరుకునే విషతుల్యాల వల్ల నిద్ర కూడా చెడిపోతుంది. కిడ్నీ సమస్యలున్న వారు నిద్రలేమితో బాధపడుతుంటారు. రోజంతా అలసట, నిస్సత్తువ వేధిస్తాయి.
కిడ్నీ సమస్యతో బాధపడే కొందరిలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. రాత్రి వేళ పడుకున్న సందర్భంలో శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి, వయసుపైబడ్డ వారు నిత్యం తమ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలి. చిన్న తేడా ఉన్నా గానీ నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే రోగాన్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..
భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..