చెట్టుకూ చిరునామా ఉంది...
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:29 AM
జర్మనీలోని యుటిన్ పట్టణానికి సమీపంలో ఉన్న ‘డోడౌర్’ అడవిలో ఒక ఓక్ చెట్టు ఉంది. దానిని ‘బ్రైడ్‌గ్రూమ్ ఓక్’ అని స్థానికులు పిలుస్తుంటారు. ఎవరైనా వారి కోరికను వెల్లడిస్తూ, ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.
స్నేహితులకో, బంధువులకో ఉత్తరాలు రాయడం తెలిసిందే. కానీ చెట్టుకి ఉత్తరాలు రాయడం ఎక్కడైనా చూశారా? జర్మనీలోని యుటిన్‌కు వెళితే ఆ వింత కనిపిస్తుంది. అక్కడున్న ఓక్ చెట్టుకి రోజూ నాలుగైదు ఉత్తరాలు వస్తుంటాయంటే నమ్ముతారా? తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆ చెట్టుకు ఉత్తరాలు రాసే వారున్నారు. వేల ఉత్తరాలు వస్తుండటంతో అధికారులు చెట్టుకి ఏకంగా పోస్టల్ కోడ్ కేటాయించారు. ఆ విశేషాలే ఇవి...
జర్మనీలోని యుటిన్ పట్టణానికి సమీపంలో ఉన్న ‘డోడౌర్’ అడవిలో ఒక ఓక్ చెట్టు ఉంది. దానిని ‘బ్రైడ్‌గ్రూమ్ ఓక్’ అని స్థానికులు పిలుస్తుంటారు. ఎవరైనా వారి కోరికను వెల్లడిస్తూ, ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. గత శతాబ్దకాలంలో ఈ చెట్టుకు కొన్ని వేలమంది ఉత్తరాలు రాశారు. వారిలో చాలామంది ‘మా కోరికలు నెరవేరాయ’ని చెబుతారు. ఎక్కువమంది భాగస్వామి దొరకాలని ఉత్తరాలు రాస్తుంటారు. రోజు రోజుకు ఉత్తరాల సంఖ్య పెరగడంతో... అధికారులు ఏకంగా ఆ చెట్టుకు ఓ పోస్టల్ కోడ్‌తో చిరునామాను కేటాయించారు. ఆ చిరునామాతో ప్రపంచం నలుమూలల నుంచి వేల ఉత్తరాలు ఇప్పటికీ వస్తున్నాయి.

ఎలా మొదలైందంటే...
ఈ ఓక్ చెట్టుకు ఐదువందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న కథేమిటంటే... చాలా ఏళ్లక్రితం... సెల్టిక్ అధిపతి కుమారున్ని కొంతమంది చెట్టుకు కట్టేశారు. అది చూసిన ఒక క్రైస్తవ అమ్మాయి ఆ కట్లు విప్పదీసి, అతడిని కాపాడింది. అందుకు కృతజ్ఞతగా అతడు ఒక చెట్టును నాటినట్టు చెబుతారు. అయితే ‘అందులో నిజం లేద’ని చరిత్రకారులు అంటారు. అన్యమత ఆరాధనను ప్రోత్సహించడానికి ఓక్ చెట్టును నాటారని అంటారు.

అదెలా ఉన్నా ఈ ప్రేమలేఖలు రాసే సంప్రదాయం మొదలవ్వడం వెనక మరోకథ ప్రాచుర్యంలో ఉంది. సుమారు వందేళ్ల క్రితం... ఓర్ట్ (మిన్నా) అనే అమ్మాయి షుట్టే ఫెల్చే అనే అబ్బాయుతో ప్రేమలో పడింది. వారి ప్రేమను అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. ఇద్దరినీ కట్టడి చేశారు. దాంతో ప్రేమికులు అక్కడున్న ఒక చెట్టు కాండానికి ఉన్న తొర్రలో లెటర్స్ వేస్తూ, రహస్యంగా సంభాషించుకునే వారు. చివరకు ఓర్ట్ తండ్రి ఒప్పుకోవడంతో 1891లో అదే చెట్టు కింద ఆ ప్రేమికుల వివాహం జరిగింది.
వారి ప్రేమ సక్సెస్ కావడానికి చెట్టు కారణమని అందరూ భావించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో ప్రేమలో ఉన్నవారు ఉత్తరం రాసి చెట్టు తొర్రలో వేయడం ప్రారంభించారు. అలా చేయడం వల్ల వారి ప్రేమ సక్సెస్ అయిందని చాలామంది చెబుతారు. ఆ విధంగా ఆ చెట్టు బాగా పాపులర్ కావడంతో 1927లో జర్మనీ పోస్టల్ డిపార్టుమెంట్ అధికారులు... చెట్టుకు ఒక పోస్టల్ కోడ్ కేటాయించారు. ఆ తరువాత ప్రపంచం నలుమూలల నుంచి ఆ చెట్టుకు ఉత్తరాలు రావడం ప్రారంభమైంది.
మరో చెట్టుతో పెళ్లి...
ప్రేమికుల చెట్టుగా ప్రసిద్ధి చెందిన దాని కాండానికి ఉండే లోతైన తొర్ర పది అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఒక నిచ్చెనను చెట్టుకు అమర్చారు. ఉత్తరాలను నిచ్చెన ఎక్కి అందులో వేస్తారు. ఇప్పటిదాకా ఈ చెట్టు ద్వారా కొన్ని వందల వివాహాలు జరిగినట్టు చెబుతారు. ఇప్పటికీ ‘బ్రైడ్‌గ్రూమ్ ఓక్ ట్రీ’కి రోజుకు ఐదారు ఉత్తరాలు వస్తుంటాయి ‘‘ఏటా వెయ్యిదాకా ఉత్తరాలు వస్తుంటాయి. వేసవిలో వాటి తాకిడి కాస్త ఎక్కువే. ప్రేమలో పడాలని కోరుకోని వారు ఎవరుంటారు?’’ అంటారు డచ్ పోస్ట్‌లో పనిచేస్తున్న మార్టిన్. 2009లో ఈ ఓక్ చెట్టుకు డస్సెల్ డార్ఫ్‌లో ఉన్న హార్స్ చెస్ట్‌నట్ ట్రీతో సింబాలిక్‌గా పెళ్లి జరిపించారు. సొంత పోస్టల్ అడ్రస్ కలిగిన రెండో చెట్టు అది. ప్రపంచవ్యాప్తంగా ఇళ్లకు, కార్యాలయాలకు పోస్టల్ చిరునామాలుంటే... ఒక ఓక్ చెట్టుకు దానిని కేటాయించడం విశేషమే కదా!