TG Assembly: నేడు అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ.. వ్యూహాలు రచిస్తున్న నేతలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:04 AM
అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్: నేడు రెండవ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ మొదలుకానుంది. అయితే.. ఇవాళ(ఆదివారం) అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై కీలక చర్చ జరగనుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. సభలో సభ్యులందరికీ కాళేశ్వరం విచారణ కమిషన్‌కు సంబంధించి 665 పేజీల రిపోర్టును అందజేయనున్నారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి 9 గంటల నుంచి 9.30 వరకు మాత్రమే అసెంబ్లీలో ఉండనున్నట్లు సమాచారం. 9.30 గంటల తరువాత బేగంపేట విమానాశ్రయం నుంచి కేరళ వెళ్లానున్నారు. అనంతరం తిరగి సాయంత్రం 3.40 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు సీఎం హాజరుకానున్నారు.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సభలో చర్చలు జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ చర్చ సంధర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం రిపోర్ట్ చర్చ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కల్పించారు. అలాగే నిన్న(శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కాళేశ్వరం చర్చకు సంబంధించి కేటీఆర్, హరీష్ రావులు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీలో యూరియా, వరదల నష్టంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
కాళేశ్వరం నివేదికపై తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని హరీష్‌రావు పిటిషన్ వేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని తెలిపారు. తాము వివరణ ఇచ్చే అవకాశం లేకుండా.. ఏకపక్షంగా బాధ్యులుగా పేర్కొంటూ ఇచ్చిన నివేదిక చెల్లదుని పేర్కొన్నారు. నివేదికపై ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ తగిన ఉత్తర్వులు జారీచేయాలన్నారు. రాజకీయ దురుద్దేశంతో తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున మధ్యంతర పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఒకవేళ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించినా తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే దీనిపై రేపు(సోమవారం) విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ అసెంబ్లీలో కీలకంగా మారిన కాళేశ్వరం నివేదిక చర్చకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా..? రారా.. ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..