‘యాప్’రే... అన్నీ ఇంటికే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:41 AM
ఒకప్పుడు డబ్బులకు కటకటలాడేవారు జనం.. ఇప్పుడు సేవలు పొందడానికి ‘ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తాం’ అంటున్నారు. కాలు కదపకుండా ఇంటికే తెప్పించేసుకుంటున్నారన్నీ!. అవి వైద్యసేవలు కావొచ్చు.. పెంపుడు జంతువుల సంరక్షణ కావొచ్చు.. సెలూన్ సేవలూ అవ్వొచ్చు.. ఏదైనా సరే! ఒక ‘యాప్’ సాయంతో ఇంటి ముంగిటకొస్తున్న రకరకాల సర్వీసుల ధోరణి బాగా విస్తరిస్తోంది..
ఒకప్పుడు డబ్బులకు కటకటలాడేవారు జనం.. ఇప్పుడు సేవలు పొందడానికి ‘ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తాం’ అంటున్నారు. కాలు కదపకుండా ఇంటికే తెప్పించేసుకుంటున్నారన్నీ!. అవి వైద్యసేవలు కావొచ్చు.. పెంపుడు జంతువుల సంరక్షణ కావొచ్చు.. సెలూన్ సేవలూ అవ్వొచ్చు.. ఏదైనా సరే! ఒక ‘యాప్’ సాయంతో ఇంటి ముంగిటకొస్తున్న రకరకాల సర్వీసుల ధోరణి బాగా విస్తరిస్తోంది..
నర్సింగ్ సేవలు
రవళికి మొన్నే పెద్ద శస్త్రచికిత్స జరిగింది. పది రోజులు సెలవు పెట్టి అన్నీ తనే అయ్యారు ఆమె భర్త. సెలవులు అయిపోయాయి. ఆఫీసుకు వెళ్లక తప్పని పరిస్థితి ఆయనది. కానీ ఆమెని ఇంట్లో ఒంటరిగా వదిలేయాలంటే బాధ. రవళికి చికిత్స చేసిన ఆస్పత్రి వాళ్లతో మాట్లాడితే వెంటనే ఓ నర్సును పంపించారు. రవళి దగ్గరే ఉంటూ సపర్యలు చేస్తోంది నర్సు. ఇలా శస్త్రచికిత్సలు అయిన వారికి, వృద్ధులకు, రోగులకు వెన్నంటి ఉండే మనుషుల అవసరం ఎంతో ఉంది.

అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులకు ఇది ఎల్లప్పుడూ సాధ్యపడకపోవచ్చు. అందుకే ఇంటికే నర్సింగ్ సేవలు వచ్చేశాయిప్పుడు. సమయానికి మందులు, ఆహారం అందిస్తూ, వారికి అవసరమైన సేవలు చేస్తూ త్వరగా కోలుకొనేలా చేయడం వీరి బాధ్యత. ప్రతి నగరంలోనూ నర్సింగ్ సేవలు అందించే సంస్థల వివరాలు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు ప్రత్యేక విభాగంగా ఈ సేవలని అందిస్తున్నాయి. ‘యాప్’లలో నర్సింగ్ సేవల కోసం వెదికితే ఆ వివరాలన్నీ వస్తాయి. పేషెంట్లు, వృద్ధుల కోసం 24 లేదా 12 గంటలు... అవసరాలకు తగినట్టుగా వీళ్లు సేవలు అందిస్తారు.

సేవలను బట్టి ఛార్జీలు ఉంటాయి. ఈ పర్సనలైజ్డ్ నర్సింగ్ సర్వీసుల్లో పురుషులు, మహిళలూ ఉండడం విశేషం. సాధారణ వైద్య పరీక్షలు ఇళ్లలోనే చేయించేందుకు వీరు సహకరిస్తారు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. పైగా బయటికి వెళ్లడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లను దూరం పెట్టవచ్చు. అలాగే ఎల్లప్పుడూ తమతో ఒకరు ఉన్నారన్న భరోసా కలిగించవచ్చు. సాధారణంగా ఇళ్లల్లో పనులు చేస్తున్న వాళ్లు లేదా తెలిసిన వాళ్ల కన్నా కూడా సుశిక్షుతులైన నర్సులను కేర్ టేకర్స్‌లా పెట్టుకోవడం ఎల్లవేళలా మంచిది.

డ్రైవర్ రెడీ
భానుప్రకాశ్ కూతురుకి పెళ్లి కుదిరింది. నెల రోజుల పాటు షాపింగ్ ప్లాన్ చేసింది వాళ్ల ఆవిడ. నగరంలో రోజూ ఒక్కో ప్రాంతానికి వెళ్లాలి. వాళ్లు ఎన్నో ఏళ్లుగా ఆ నగరంలోనే ఉంటున్నారు. దారులన్నీ తెలిసినవే. అయితే పెళ్లి హడావిడిలో డ్రైవింగ్ కూడా తనే అంటే టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు ఆయన. ఫేస్‌బుక్‌లో ప్రకాశ్ దృష్టిని ఓ యాప్ ఆకర్షించింది. అందులో లాగినై, తన అవసరాలు తెలియజేశారు. వెంటనే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. డ్రైవర్‌నూ పంపించారు. కారు మనదే, పెట్రోలు మనదే కానీ డ్రైవర్ మాత్రం వేరే. అతడి సర్వీస్ మేర డబ్బులు చెల్లిస్తే సరి. దీనివల్ల సొంత పనుల మీదే మన ఫోకస్ ఉంటుంది.
వెళ్లే దారుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి డ్రైవర్ సేవలు అందించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలనే ఎంచుకోవడం మంచిది. ఆ డ్రైవర్లు అన్ని విధాలుగా సుశిక్షితులై ఉంటారు. కాబట్టి, మన ప్రయాణం సజావుగానే సాగుతుందనే భరోసా కలుగుతుంది. మహానగరాల్లో పెళ్లిళ్లకు, డే టూర్లకు, షికార్లకు వెళ్లేందుకు అద్దె డ్రైవర్లను తీసుకుని వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

ఇంటికే మందులు
‘బీపీ మందులు అయిపోయాయి, తీసుకువస్తావా’ రాత్రి పది గంటలకు ఓ తాతయ్య గాబరాగా మనవడిని అడిగారు. ఆ మందుల వివరాలు తీసుకుని ల్యాప్‌టాప్‌లో పనిలో నిమగ్నమయ్యాడు మనవడు. తాతయ్యలో ఆందోళన. మనవడు మాత్రం తనపని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మనవడు వెళ్లి తలుపు తెరచి, రెండు నిమిషాల్లో వెనక్కి వచ్చి తాతయ్య చేతిలో మందుల కవరు పెట్టాడు. ఆశ్చర్యపోతున్న తాతను చూస్తూ అతడు ‘మనం మందుల్ని ‘యాప్’లో ఆర్డర్ పెడితే, ఫార్మసీ షాపుల వాళ్లు ఇంటికే డెలివరీ చేస్తార’ని వివరించాడు. చిన్నా పెద్దా అన్ని నగరాల్లో ఈ సర్వీసులు వచ్చేశాయిప్పుడు.
కొన్నిచోట్ల 24 గంటలూ డెలివరీని ఇస్తుండటం విశేషం. యాప్‌లలో కావలసిన మందులను ఆర్డర్ పెడితే డోర్ డెలివరీ చేస్తారు. అయితే ముఖ్యమైన మందులకు డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అడుగుతారు. దాన్ని అప్‌లోడ్ చేస్తే సరి. ప్రతి ఇంట్లో వయసు పైబడిన వాళ్లు ఉంటారు. బీపీ, షుగరు లాంటివి ఓ వయసు వచ్చాక అందరికీ మామూలై పోతున్నాయి. అందుకే నెల నెలా మందులు కొనే వాళ్లు పెరిగారు. అలాంటి వాళ్లకి ఇలాంటి డోర్ డెలివరీలు ఎంతో ఉపయోగపడతాయి. మాటి మాటికీ మందుల షాపుకి వెళ్లి అక్కడ క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. అలా సమయం ఎంతో వృథా అవుతుంది.

పెట్స్ కోసం
అనఘ వాళ్లింట్లో గోల్డెన్ రిట్రీవర్ ఉంది. ఆ శునకానికి స్నానం చేయించాలంటే పెద్ద ప్రహసనమే. వాళ్లది 3బిహెచ్‌కే ఫ్లాట్. మామూలు బాత్రూమ్‌లు సరిపోవు, అందుకే బాల్కనీలో డాగీకి స్నానం చేయిస్తారు. ఆరోజు వాళ్ల ఇళ్లంతా ఆ కుక్కగారి బొచ్చే. పోనీ పెట్ గ్రూమింగ్ సర్వీసు సెంటర్ల దగ్గరికి వెళదామా అంటే కార్లు, ఆటోల్లో తీసుకుపోవాలి. అక్కడ క్యూలో ఉండాలి. అది కూడా ప్రయాసే. ఇలా పెంపుడు జంతువులు ఉన్న వాళ్ల కష్టాలు తీర్చేందుకు ఆన్‌లైన్ పెట్ సర్వీసులు వచ్చేశాయి. మనం ఖాళీగా ఉన్న రోజున వాళ్లకి కబురుచేస్తే చాలు పెంపుడు జంతువు అవసరాల్ని బట్టి వారి సర్వీసులు అందజేస్తారు.
గ్రూమింగ్, బాతింగ్, గోర్లు కత్తిరించడం, బ్రష్ చేయించడం ... ఇలా అనేక సర్వీసులు పొందవచ్చు. వీళ్లందరూ సుశిక్షితులు కాబట్టి నాణ్యమైన సర్వీసులను పొందడానికి వీలవుతుంది. వీళ్లు మన ఇళ్లకే సర్వీసు బళ్లలో వస్తారు. ఆ బండిలోకి మన పెంపుడు జంతువును ఎక్కించుకుని, సర్వీసు చేస్తారు. మన కళ్ల ముందే అన్నీ చేస్తారు కాబట్టి, మనకే కాదు, పెట్‌కు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. నీళ్లు, కరెంటు, వస్తువులు, సరంజామా అంతా వాళ్లదే. మనం డబ్బు కడితే చాలు. పైగా ఎంతో ప్రయాస తగ్గుతుంది. ఇలా ఇళ్ల దగ్గరికే సర్వీసులు రావడం వల్ల పెంపుడు జంతువుల ప్రేమికులకు ఎంతో ఉపయోగం.
కీటకాల నియంత్రణలో..
సంయుక్త దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వారాంతంలో మాత్రమే వాళ్లకి ఖాళీ దొరకుతుంది. రుచికరమైన వంటకాల్ని వండుకుని ఆరగించడంలోనే వీకెండ్ గడిచిపోతుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి సమయమే దొరకట్లేదు. ఏదో పైపైన కానిస్తున్నారు. దీంతో వంటింట్లో బొద్దింకలు, బాత్రూమ్‌లలో పురుగులు వచ్చేశాయి. ఆఖరికి పరుపుల్లో ఒకటీరెండు నల్లులూ కనిపించాయి. ఈ కీటకాల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో చిట్కాలు ప్రయత్నించారు.
కానీ సమస్య తీరట్లేదు. ఇంటర్నెట్‌లో వెతుకుతుంటే ‘బెడ్ బగ్స్ కంట్రోల్ సర్వీసు యాప్స్’ కనిపించాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇలాంటి సర్వీసులు కూడా ఆన్‌లైన్‌లో వచ్చేశాయి. కాలానుగుణంగా మారిన అవసరాలకు అద్దం పడుతున్నాయి ఈ సేవలు. ఇంటిని శుభ్రపరచడం, దుమ్ము దులపడంతో పాటు కీటకాల బారి నుంచి ఇంటి పరిరక్షణకు సంబంధించిన సర్వీసులు ఇవన్నీ. మన అవసరాల్ని బట్టి రసాయన, రసాయనేతర పద్ధతుల్లో ఇంట్లోని క్రిములు, కీటకాలను తొలగిస్తారు. నగర జీవితాలను సుఖమయం చేసే సర్వీసుల్లో ఇది కూడా ముఖ్యమైనదే.
పార్శిల్ సర్వీస్
పోస్టల్ సర్వీసులు మనకు తెలిసినవే. కొరియర్ సర్వీసులూ పొందుతున్నాం. అయితే మనం ఇళ్లల్లో మర్చిపోయిన చిన్న చిన్న వస్తువులను కూడా వెంటనే తెప్పించుకునే పార్శిల్ సర్వీసులు వచ్చాయంటే నమ్మగలరా? ఆఖరుకి తాళాలు మర్చిపోయినా తెప్పించుకోవచ్చు. ప్రత్యేకంగా ఓ డబ్బాలో ఆ వస్తువుని భద్రపరిచి, దానికి సీల్ వేసి, బరువు ప్రకారం స్టాంపులు అతికించడం లాంటివి ఈ సరికొత్త పార్శిల్ సర్వీస్ ప్రపంచంలో లేనేలేవు. ఓ కవర్‌లో తాళంచెవులు పెట్టి పార్శిల్ వ్యక్తికి అందిస్తే చాలు.. అతడు యాప్‌లో పేర్కొన్న అడ్రస్‌లో అందజేస్తాడు. ముఖ్యంగా పట్టణాల్లోని మహిళామణులకు ఈ సేవలు ఎంతో ఉపకరిస్తున్నాయి. కొత్త ఆవకాయ పచ్చళ్లు, రోటిపచ్చళ్లు, తినుబండారాలు, చీరలు, బ్లౌజులు ... ఇలా ఎన్నింటినో కుటుంబసభ్యులపై ఆధారపడకుండా పార్శిల్ సర్వీసులను వినియోగిస్తూ మహిళలు ముందడుగు వేస్తున్నారు.
పురోహితులు సైతం
’రేపు సత్యనారాయణ వ్రతం... ఇంటి పక్క గుడిలోని అర్చకులను పూజకు పిలుచుకురావాలి...’ అంటే నేడు కుదరదు. ఎందుకంటే పెరిగిన భక్తి కార్యక్రమాల కారణంగా పురోహితులు చాలా బిజీ. సమయానికి వాళ్లు దొరక్క కార్యక్రమాలు వాయిదా పడుతున్న సందర్భాలూ పెరుగుతున్నాయి. అందుకే పురోహితులని ముందుగానే బుక్ చేసుకోవాల్సిన రోజులు వచ్చాయి. వీరి సేవలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అనేక ‘యాప్’లు సేవలందిస్తున్నాయి. అక్షరాభ్యాసం, అన్నప్రాసన, బారసాల, సత్యనారాయణ వ్రతం, గృహప్రవేశం, షష్టిపూర్తి, గణపతి హోమం... ఇలా సందర్భం ఏదైనా సరే ఆన్‌లైన్‌లో పురోహితులను బుక్ చేసుకునే అవకాశం నగర ప్రాంత వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఈ సేవలు గ్రామాల్లో విస్తరించలేదు. దీనివల్ల ఆఖరి నిమిషంలో పురోహితులు అందుబాటులో లేరని బాధ పడవలసిన అవసరం ఉండదు. అనుకున్న రోజునే శుభకార్యాలను పూర్తిచేయవచ్చు. ముందుగా పురోహితుడిని కన్‌ఫర్మ్ చేసుకున్న తరవాతే క్యాటరింగ్, షామియానా సేవల వారికీ, బంధుమిత్రులకు సమాచారం అందజేయడం వల్ల అంతా సజావుగా సాగుతుందనే నమ్మకం కలుగుతుంది.
సెలూన్ సేవలు
పెళ్లిళ్ల సీజన్ కావున శ్రీలక్ష్మికి బ్యూటీ పార్లర్‌కు వెళ్లేందుకు అస్సలు కుదరడం లేదు. అదే విషయం స్నేహితురాలితో అంటే, ‘ఇప్పుడు అంతా ఆన్‌లైన్ సర్వీసులే. బ్యూటీ పార్లరే నీ ఇంటికి వచ్చి సేవలు చేస్తుంద’ని వివరించింది. కాలం మారిందని శ్రీలక్ష్మి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. ఫేషియల్, వాక్సింగ్, త్రెడింగ్, మెనిక్యూర్, పెడిక్యూర్, హెన్నా... అనేక రకాల బ్యూటీ సర్వీసులను వీళ్లు ఇళ్లల్లోనే అందిస్తారు. అలాగే కేశాలు, చర్మానికి సంబంధించిన బ్యూటీ ట్రీట్‌మెంట్లనూ ఇళ్లల్లో చేస్తున్నారు. ఇంకా పెళ్లిళ్లప్పుడు పెళ్లికూతురు, పెళ్లికొడుకు మేకప్‌లు కూడా వీళ్ల సర్వీసుల్లో భాగమే.
స్పాలు అందించే ప్రత్యేక థెరపీలు కూడా ఇళ్ల దగ్గరకే తీసుకురావడం విశేషం. అయితే ఏది సరిగా లేకపోయినా ఆన్‌లైన్‌లో కస్టమర్లు నెగిటివ్ కామెంట్లు చేస్తారనే భయం వీళ్లకి ఎప్పుడూ ఉంటుంది. అందుకే హోమ్ సర్వీసుల కోసం సీనియర్ బ్యూటీషియన్లు, అనుభవజ్ఞులనే పంపిస్తారు. స్టార్ రేటింగ్‌ను పెంచుకుని బిజినెస్‌ను మరింత పెంచుకోవాలన్నది ఈ సెలూన్ సేవలు అందించే బ్యూటీపార్లర్ల లక్ష్యం.
ఇలా మారిన జీవన విధానాలకు తగినట్టు ఎన్నో రకాల ఆన్‌లైన్, ‘యాప్’ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో చాలా వాటిని మన వెనకటి తరం వాళ్లు ఊహించి ఉండరు కూడా. ఈ సేవల వల్ల సమయం ఆదా అవుతుంది. శ్రమ తగ్గుతుంది. అయితే ఇవన్నీ డబ్బుతో ముడిపడినవేనని మాత్రం మర్చిపోకూడదు.
- సండే డెస్క్