Air India:టేకాఫ్ అయిన వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:08 AM
విమానం ఇంజిన్‌లో నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. దీంతో కాక్ పిట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం తిరిగి న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఆదివారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఏఐ2913 విమానం బయలుదేరింది. అయితే కుడి ఇంజిన్‌లో అగ్గి రవ్వలు రేగినట్లు కాకిపిట్‌లోని సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని విమాన పైలెట్‌కు అందించారు. దీంతో విమాన పైలెట్ వెంటనే అప్రమత్తమ్యారు. విమానాన్ని తిరిగి న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దింపివేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది.
విమానంలోని ఇంజిన్‌లో ఏర్పడిన సమస్యను సాంకేతిక నిపుణుల బృందం పరిశీలిస్తుందని తెలిపింది. అలాగే ఈ విమాన సర్వీసులో ఇండోర్ చేరుకోవాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది. అందులో భాగంగా మరో విమానంలో ఈ ప్రయాణికులందరిని గమ్యస్థానానికి చేర్చుతున్నట్లు పేర్కొంది. ఇక ఈ సంఘటనపై ఎయిర్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు సమాచారం అందించినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది.
ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక్కరు మినహా 240 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ అప్రమత్తమైంది. అందులోభాగంగా తమ సంస్థకు చెందిన విమానాలను క్షుణ్ణంగా పరీక్షించి.. ఆ తర్వాత సర్వీసులను నడుపుతోంది. ఏ మాత్రం చిన్న పాటి సాంకేతిక లోపం తలెత్తినా.. వెంటనే ఎయిర్ ఇండియాతోపాటు ఆ సంస్థకు చెందిన సిబ్బంది అప్రమత్తమవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న తేజస్వీ
ఇంట్లోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఒకరు మృతి
For More National News And Telugu News