అడవిలో అక్షరం మొలిచింది..
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:09 AM
వాటర్ వీలర్... బిందెలతో ఎగుడుదిగుడు నేలల్లో నీటిని మోసుకెళ్లే కష్టాలు తప్పించే చిన్న సాధనం. అటవీ ప్రాంతాల్లో 20 నుంచి 30 లీటర్ల వరకు నీళ్లు నింపుకొని, సులువుగా పిల్లలు కూడా తోసుకుంటూ వెళ్లొచ్చు. చిక్కని అడవిలో వాగులో నీళ్లను వాటర్ వీలర్‌తో తోసుకుంటూ బడి వైపు వచ్చారు చిన్నారులు.
వాటర్ వీలర్... బిందెలతో ఎగుడుదిగుడు నేలల్లో నీటిని మోసుకెళ్లే కష్టాలు తప్పించే చిన్న సాధనం. అటవీ ప్రాంతాల్లో 20 నుంచి 30 లీటర్ల వరకు నీళ్లు నింపుకొని, సులువుగా పిల్లలు కూడా తోసుకుంటూ వెళ్లొచ్చు. చిక్కని అడవిలో వాగులో నీళ్లను వాటర్ వీలర్‌తో తోసుకుంటూ బడి వైపు వచ్చారు చిన్నారులు. అప్పటికే అక్కడ కొందరు పిల్లలు మొక్కలు నాటుతున్నారు. వీలర్‌తో తెచ్చిన నీళ్లను వాటికి పోస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం ఓ గంట ఇదే పని. మిడ్ డే మీల్స్‌కి అవసరమైన కాయగూరలు, ఆకుకూరలను ఎలా పండించాలో చదువుతో పాటు నేర్చుకుంటున్నారు.

అదొక ఆకుపచ్చని పాఠశాల. తెలంగాణలోని ములుగు జిల్లా నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కన్నాయి గూడెం మండలంలో వాగులు వంకలు దాటి వెళ్తే వస్తాయి ఆదివాసీ గూడేలైన ఐలాపూర్, తక్కళ్లగూడెం.
‘రేపటి పౌర సమాజం బాగుండాలంటే నేటి బాలల భవిష్యత్ బాగుండాలి’ అనేది సంతోష్ ఇస్రం సంకల్పం. బడి లేని చోట చదువుకు ఇబ్బంది పడుతున్న చిన్నారులను తీర్చిదిద్దాలనుకున్నాడు. తనతో పాటు మరి కొందరు స్నేహితులను కలుపుకొని ఆ రెండు ఆవాసాల్లో అడవి బిడ్డలను చదువుల బాట పట్టిస్తున్నాడు. ఏడాది పాటు ఐలాపూర్, తక్కళ్ల గూడెం జీవన విధానాన్ని, చిన్నారుల పరిస్థితులను సంతోష్ టీమ్ అధ్యయనం చేసింది. సమస్యలకు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషించారు. సమస్యలేవీ పరిష్కరించ లేనంత క్లిష్టమైనవి కావు. కావాల్సింది ఒక సమష్టి తత్వం. ఫలితమే ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’.
కొత్త సిలబస్...
‘ఎ ఫర్ యాపిల్ అని పాఠం చెబితే ఈ అడవిబిడ్డలకు అర్థం కాదు. ఎందుకంటే వారికి యాపిల్ ఎలా ఉంటుందో తెలీదు. వారి చుట్టూ ఉన్నదానినే పాఠాలుగా చెప్పాలనుకున్నాం. అందుకే అ ఊౌట అుఽ్టట ... అని చెబుతాం. వారికి చీమలు తెలుసు. ఆకలి తట్టుకోలేక పెద్దవాళ్లు వాటిని కూర చేస్తే, తింటూ ఎదిగారు...’ అని జీవనపాఠాల వెనుక ఉన్న నిజం చెబుతాడు సంతోష్.
అంబేడ్కర్, కొమురం భీమ్ వంటి స్ఫూర్తి ప్రదాతల చరిత్ర, పర్యావరణంపై సరళమైన భాషలో కామిక్స్ రూపంలో కథల పుస్తకాలను రూపొందించి ఈ పిల్లలతో చదివిస్తున్నారు.
కేవలం చదువు మాత్రమే కాకుండా మట్టితో బొమ్మల తయారీ, కాయగూరలు సాగు చేయడం, వాటిలోని పోషక విలువల గురించి వారికి అర్థమయ్యేలా పాటల రూపంలో

చెప్పడం వల్ల బడికి రావడానికి పిల్లలు ఉత్సాహం చూపిస్తున్నారు. మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, డ్రామా, పెయింటింగ్, విలువిద్య నేర్పిస్తారు.
రెండో తరగతి వరకు పిల్లలు కనీస విద్య నేర్చుకునేలా తీర్చిదిద్దిన తర్వాత... దగ్గరలో ఉన్న ఆశ్రమ స్కూల్స్‌లో చేర్పిస్తారు. పర్యా వరణంపై అవగాహనకు బడిలోనే సోలార్ పవర్‌తో పనిచేసే టీవీని ఏర్పాటు చేశారు.
ప్లే స్కూల్‌లా...
ఈ బడి ప్రారంభించిన కొత్తలో చాలా తక్కువమంది వచ్చేవారు. పండ్లు, బిస్కెట్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు పిల్లలకు ఇవ్వడంతో వారి సంఖ్య 200లకు పెరిగింది. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఆటల పోటీలు నిర్వహించడం, బాగా చదువుతున్న వారికి బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు.
‘ఇదంతా అటవీ ప్రాంతం. బస్ కాదు కదా, ఆటోలు, బైకులు కూడా పోలేవు. కాలినడక బాట కూడా సరిగా లేదు. చదువుకున్నవారు లేరు. ఇక్కడ పెద్ద గోడలు లేవు. కనీసం బ్లాక్ బోర్డు కూడా లేదు. కరెంట్ లేదు. నీళ్ళు లేవు. ఈ పరిస్థితిలో చిన్నారులకు అక్షరాలు నేర్పించాలనుకొని కుటీరం లాంటి చిన్న పూరి పాకలు నిర్మించాం. ఈ మధ్య తక్కళ్ల గూడెంలో పక్కా స్కూల్ బిల్డింగ్‌కి మంత్రి సీతక్క సాయం చేశారు. ఈ బడులను ప్లే స్కూల్‌లా తీర్చిదిద్దాం. తెలుగు, ఇంగ్లీష్ బేసిక్స్‌తో పాటు కథలు, పాటలు, ఆటలు నేర్పిస్తున్నాం. రెండో తరగతి వరకు చదివించి ఆ తరువాత హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్‌లో చేర్పిస్తాం’ అన్నాడు సంతోష్. ఇతడు ఉస్మానియాలో జర్నలిజంలో పీజీ చేశాడు. సొంతూరు ములుగు. తను కూడా
ఈ పిల్లల లాగే బాల్యంలో బడిలేక చాలా కష్టాలు పడ్డానంటాడు. బీఆర్ అంబేడ్కర్, కొమురం భీమ్‌లను ఆదర్శంగా తీసుకొని ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ అని పేరు పెట్టారు.
నాలుగు గదులు, నల్లబోర్డు, పైన కప్పు లేకపోయినా... అంతకంటే బలమైన ఈ యువకుల సంకల్పమే రేపటి సమాజాన్ని నిర్మించే అద్భుత ప్రయోగశాలగా మారింది. పేదరికాన్ని జయించడానికి చదువుకు మించిన ఆయుధం లేదనే నమ్మకంతో వీరు అడవిలో అక్షరమై వెలుగుతున్నారు.
- శ్యాంమోహన్, 94405 95858