Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:58 AM
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.
భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) అయిన రిలయన్స్ జియో కస్టమర్లకు మరోసారి భారీ షాకిచ్చింది. ఇప్పటికే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. రూ.799 రీఛార్జ్ ప్లాన్‌ను మై జియో యాప్ నుంచి తొలగించింది. జియోలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లలో ఒకటి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటాను, 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందించేంది. ఈ ప్లాన్ మొత్తం వ్యవధిలో 126GB డేటాను వాడుకునేందుకు అవకాశం ఉండేది. ఎయిర్‌టెల్ తన రూ.249 రీఛార్జ్ ప్లాన్‌ను రూ.299కి మార్చిన వెంటనే జియో ఈ మార్పు ప్రకటించడం గమనార్హం.
ఇప్పటి వరకు జియో రూ.799 ప్లాన్‌లో వినియోగదారులు 84 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, అలాగే రోజుకు 100 SMSలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవే ప్రయోజనాల కోసం కస్టమర్లు రూ.889 ప్లాన్‌ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదనంగా, ఈ ప్లాన్ ద్వారా జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒక మంచి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉంది. ఇందులో 70 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలతో పాటు, జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
కానీ, జియో ప్రస్తుతం 5G సేవలను కేవలం 2GB/Day లేదా అంతకంటే అధిక డేటా ప్రయోజనాలున్న ప్లాన్లకే పరిమితం చేస్తోంది. అంటే, 1.5GB/Day డేటా ఉన్న ప్లాన్లకు 5G సదుపాయం లభించదు. అయితే, టెలికాం సంస్థలు వరసగా రీఛార్జ్ ధరలు పెంచుకుంటూ పోవడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కస్టమర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచే దిశగా జియో అడుగులు వేస్తోందని.. అందుకే రూ.249, రూ.799 వంటి మధ్యమ స్థాయి ప్లాన్లను తొలగించినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఎస్‌బీఐ కొత్త స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ. 50 లక్షల బీమా.. ఎవరెవరు అర్హులంటే?