GST Exemption: జీవిత ఆరోగ్య బీమా ఇక చవక
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:07 AM
బీమా సేవలను చవకగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను జీఎ్‌సటీ నుంచి మినహాయించాలని మోదీ సర్కారు ప్రతిపాదించింది....
వ్యక్తిగత లైఫ్, హెల్త్ పాలసీలకు జీఎ్‌సటీ మినహాయింపు
కేంద్ర ప్రతిపాదనకు జీఓఎంలో ఏకాభిప్రాయం
త్వరలో జీఎస్‌టీ కౌన్సిల్‌కు నివేదిక
బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వెల్లడి
న్యూఢిల్లీ: బీమా సేవలను చవకగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను జీఎ్‌సటీ నుంచి మినహాయించాలని మోదీ సర్కారు ప్రతిపాదించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీమాపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) కన్వీనర్ సామ్రాట్ చౌదరి బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18ు జీఎ్‌సటీ ఉంది. బీమా జీఓఎం బుధవారం సమావేశమై కేంద్రం తాజా ప్రతిపాదనపై చర్చించింది. అన్ని రాష్ట్రాల మంత్రులు ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, జీఓఎం సభ్యులు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే, జీఎస్‌టీ మినహాయింపు ప్రయోజనాలు కస్టమర్లకు చేరేలా చూడాలని జీఎ్‌సటీ మండలిని సభ్యులు కోరినట్టు ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన విధానాన్ని జీఎ్‌సటీ మండలి నిర్ణయిస్తుందన్నారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎ్‌సటీ మినహాయింపుతో వార్షిక పన్ను రాబడి రూ.9,700 కోట్ల మేర తగ్గవచ్చన్నారు.
జీఎ్‌సటీ మండలికి త్వరలోనే నివేదికను సమర్పించనున్నట్లు జీఓఎం సమావేశం అనంతరం సామ్రాట్ చౌదరి తెలిపారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలతో పాటు కొందరు వ్యక్తపరిచిన ఆందోళనలను సైతం నివేదికలో చేర్చనున్నట్లు ఆయన చెప్పారు. పన్ను మినహాయింపుపై జీఎ్‌సటీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మలి తరం జీఎ్‌సటీ సంస్కరణల్లో భాగంగా కేంద్రం లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై పన్ను మినహాయించాలని ప్రతిపాదించింది. బీమా పాలసీల జీఎ్‌సటీ రేట్లపై సూచనలు చేసేందుకు 13 మంది రాష్ట్ర మంత్రులతో గత సెప్టెంబరులో జీఓఎం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్ రాష్ట్రాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ అక్టోబరు కల్లా జీఎ్‌సటీ మండలికి జీఓఎం నివేదిక సమర్పించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై రూ.8,262.94 కోట్లు, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ.1,484.36 కోట్ల ఆదాయం సమకూరింది.
సంస్కరణలపై ఏకాభిప్రాయ సాధనకు కృషి
మలి తరం జీఎ్‌సటీ సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ట్రాల ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం కృషి చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ఈ సంస్కరణలు దోహదపడగలవన్నారు. నిర్మాణాత్మక సంస్కరణలు, రేట్ల హేతుబద్ధీకరణ, సులభతర నిబంధనలు అనే మూడు అంశాల ఆధారంగా మలి విడత సంస్కరణలను ప్రతిపాదించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. రేట్ల హేతుబద్ధీకరణ, బీమా రంగం, పరిహార సుంకంపై ఏర్పాటైన జీఓఎంలతో సీతారామన్ బుధవారం సమావేశమయ్యారు. మలితరం సంస్కరణల ఆవశ్యకత, తాజా ప్రతిపాదనలను జీఓఎం సభ్యులకు వివరించారు. ఈ మూడు జీఓఎంలు రెండు రోజులపాటు కేంద్ర ప్రతిపాదనలపై చర్చించనున్నాయని అన్నారు. దేశవాసులపై ధరాభారాన్ని తగ్గించేందుకు ఈ దీపావళి నాటికి జీఎ్‌సటీ రేట్లను హేతుబద్ధీకరించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీఎ్‌సటీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులున్నాయి. వాటిని 5, 18 శాతం శ్లాబులకు కుదించి.. పొగాకు, ఆల్కహాల్ వంటి 5-7 రకాల నిషిద్ధ ఉత్పత్తులపైన మాత్రం 40 శాతం ప్రత్యేక రేటును విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2017 జూలై 1 నుంచి జీఎ్‌సటీ చట్టం అమలులోకి వచ్చింది. ఆ సమయంలో సగటు జీఎ్‌సటీ రేటు 14.4 శాతంగా ఉండగా.. 2019 సెప్టెంబరు నాటికది 11.6 శాతానికి దిగివచ్చిందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. ప్రతిపాదిత రేట్ల హేతుబద్ధీకరణతో 9.5 శాతానికి తగ్గవచ్చని అంటోంది. అంతేకాదు, పన్ను రేట్ల తగ్గింపుతో దేశంలో వినియోగం రూ.1.98 లక్షల కోట్ల మేర పెరగవచ్చని అంచనా వేసింది. ప్రభుత్వానికి వార్షిక పన్ను రాబడి మాత్రం రూ.85,000 కోట్ల వరకు తగ్గవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
For National News And Telugu News