Share News

Papikondalu Tour: యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:20 PM

పాపికొండలు విహార యాత్రకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్. ఈ యాత్రను నిలిపివేశారు. ఎందుకంటే..

Papikondalu Tour: యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
The Papikondalu Tour in AP

అమరావతి, ఆగస్ట్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలాంటి వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని ఉన్నతాధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. ఆ క్రమంలో పలు జలాశాయాల్లోని నీటి వివరాలు మంగళవారం అధికారులు వివరించారు.

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి వరద ఉధృతి పెరుగుతొంది. ఉదయం 6.00 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 3,22 000 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే కృష్ణ తూర్పు, పశ్చిమ కాలువలకు 3,837 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు వివరించారు. ఇక బ్యారేజ్ వద్ద 10.5 అడుగుల నీటిమట్టాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.


ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం 10 రేడియల్ క్రస్ట్ గేట్లు.. 12 అడుగులు మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో: 3,73,024 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 3,70,158 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.70 అడుగుల వరకు నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం: 197.4617 టీఎంసీలు ఉంది. అలాగే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


కర్నూలు జిల్లాలోని సుంకేశుల డ్యామ్‌కు వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో డ్యామ్‌లోని 20 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్ ప్లో 1, 40, 00 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1, 36, 587 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్‌లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0. 8608 టీఎంసీలు. ఇక కేసీ కెనాల్‌కు 2180 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.


ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ వద్ద క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. స్పిల్ వే వద్ద 31.680 మీ.. అలాగే అప్పర్ కాపర్ డ్యామ్ వద్ద 32.310మీ మేరకు నీటి మట్టం చేరింది. ఇక స్పిల్ వే ద్వారా 7,92,679 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.


రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నది వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ఇప్పటికే 10.50 అడుగులకు నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లు అధికారులు స్వల్పంగా ఎత్తారు. బ్యారేజ్ నుంచి 8.23 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేశారు. అలాగే పాపికొండల విహార యాత్రను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతుంది.


కర్నూలు జిల్లా మంత్రాలయంలోని తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం ఆలయం సమీపంలోని గంగమ్మ గుడి మెట్ల మీద వరకు వరద నీటి ప్రవాహం వచ్చి చేరింది. దీంతో తుంగభద్రకు తరలి వచ్చిన భక్తులను శ్రీరాఘవేంద్ర స్వామి దేవాలయం అధికారులు అప్రమత్తం చేశారు. ఆ క్రమంలో తుంగభద్రలో నదిలోకి స్నానాలకు వెళ్లొద్దని భక్తులను శ్రీమఠం అధికారులు హెచ్చరించారు. అలాగే తుంగభద్ర నది వద్ద ప్రత్యేక సిబ్బందిని మంత్రాలయం మఠం అధికారులు ఏర్పాటు చేశారు.


అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో సైతం భారీగా వర్షం కురుస్తుంది. దీంతో ఆ ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శబరి, గోదావరితోపాటు దాని ఉప నది శబరిలో సైతం నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. కూనవరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి నది ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో చింతూరు వద్ద శబరి నది ప్రమాదకరంగా మారింది. కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్ వేపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరరామచంద్రాపురం మండలం అన్నవరం వాగు, జల్లివారి గూడెం వాగులు పొంగడంతో ఆ ప్రాంతాలోని రహదారులు మునిగాయి. ఇక చింతూరు మండలంలో సోకు లేరు వాగు పొంగడంతో.. వీఆర్ పురం మండలం వైపునకు రాకపోకలు నిలిచి పోయాయి.


స్పందించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..

మరో వైపు భారీ వర్షాలు, వరద నీరు పోటెత్తడంతో.. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పందించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితి ఉధృతంగా ఉంది. దీంతో మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులగా ఉంది. ఇది 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ క్రమంలో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కోరింది. అందులోభాగంగా వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయ వద్దని సూచించింది.

నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి

Read Latest AP News and National News

Updated Date - Aug 19 , 2025 | 12:38 PM