Share News

Telangana Congress MPs: యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:33 AM

రాష్ట్రంలో రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలంటూ కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Telangana Congress MPs: యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం
TG Congress MPs

హైదరాబాద్, ఆగస్ట్ 20: రాష్ట్రంలో రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలంటూ కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ఈ వారంలో తెలంగాణకు సరఫరా చేస్తామని సదరు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్ మెంట్ ప్రారంభం కానుంది. ఈ వారంలో మరో మూడు షిప్‌మెంట్‌ల ద్వారా యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఆదేశాలు జారి చేసింది.


రాష్ట్రంలో యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ ఎంపీలు ఆందోళనలకు దిగారు. దీంతో తెలంగాణ రైతాంగం యూరియా కోసం పడుతున్న కష్టాలు దేశానికి తెలిసింది. దీంతో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిత్వ శాఖ స్పందించింది. కేంద్రం తెలంగాణకు భారీగా యూరియా సరఫరా చేయడంపై రాష్ట్ర ఎంపీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు.


ప్రతి పక్ష పార్టీలు రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రలపై ఆలోచన చేయాలంటూ రైతాంగానికి ఆయన కీలక సూచన చేశారు. తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బందులు ఏర్పాడ్డాయని తెలిపారు. తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.


తెలంగాణలో రైతులకు యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రంలోని మోదీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుందని రాష్ట్ర ప్రభుత్వంలోని అగ్రనేతలు ఆరోపించారు. అంతేకాకుండా.. బీజేపీ యేతర పాలిత రాష్ట్రలపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ వారు మండిపడ్డారు. యూరియా కొరతపై దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా నిలదీయాలంటూ పార్టీ ఎంపీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

For More Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 11:40 AM