Assembly elections: డీఎంకే కూటమిలోకి కొత్త పార్టీలు...
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:24 AM
వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.
- పీఎంకే రాందాస్ వర్గంతో మంతనాలు?
- డీఎండీకేకు చోటు లభించేనా?
చెన్నై: వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురడంతో అన్నాడీఎంకే మాట విని మరిన్ని పార్టీలు కూటమిలో చేరుతాయని ఆశించిన కమలనాథులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)ను కూటమిలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కుదరదంటూ భీష్మించారు.
డీఎంకే వైపు...
ఈ పరిస్థితుల్లో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు నచ్చని పార్టీలు డీఎంకే కూటమి వైపు దృష్టిసారిస్తున్నాయి. ఎనిమిదేళ్ల ముందుకు రూపొందిన డీఎంకే కూటమి చెక్కుచెదరకుండా పటిష్ఠంగానే కొనసాగుతోంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ముస్లింలీగ్, మక్కల్ నీదిమయ్యం, తమిళగవాళ్వురిమై కట్చి, మనిదనేయ మక్కల్ కట్చి మిత్రపక్షాలుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మక్కల్ నీదిమయ్యం కూటమిలో చేరినా సీట్ల కేటాయింపులలో సమస్యలు ఎదురుకావటంతో ఆ పార్టీకి సీట్లు లభించని పరిస్థితి ఏర్పడింది. దీనితో కమల్‌కు రాజ్యసభ సీటు కేటాయిస్తామనే హామీతో ఆ పార్టీతో పొత్తును ఖరారు చేసుకుంది. ఇచ్చిన మాట ప్రకారమే కమల్‌కు రాజ్యసభ సీటు కేటాయించడం, ఆయన ఎంపీగా ఎన్నికవటం జరిగాయి.

ఆ రెండు పార్టీలు, ఓపీఎస్...
రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో పీఎంకే, డీఎండీకేలు డీఎంకే కూటమిలో చేరేందుకు పావులు కదుపుతున్నాయి. ఇటీవల డీఎంకే అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ అనారోగ్యంతో బాధపడినప్పుడు డీఎండీకే చీఫ్ ప్రేమలత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆయన్ను నేరుగా కలుసుకుని పరామర్శించారు. ఆ సందర్భంగా స్టాలిన్ ఈ ముగ్గురితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఆ సందర్భంలోనే ఈ ముగ్గురూ డీఎంకే కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని,
తమకు తగినన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయిస్తే చాలునని స్టాలిన్‌తో పొత్తుపై ప్రాథమిక చర్చలను జరిపారని అరివాలయం వర్గాలు చెబుతున్నాయి. పీఎంకే రెండు వర్గాలుగా ఉన్నప్పటికీ అన్బుమణి బీజేపీ వైపు దృష్టిసారిస్తుండగా, రాందాస్ డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. స్టాలిన్‌తో ఆయన తరచూ ఫోన్‌లో సంభాషిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ఈ మూడు పార్టీలను కూటమిలో చేర్చుకునే విషయాన్ని డీఎంకే అధిష్ఠానం కూడా కాస్త సీరియ్‌సగానే పరిశీలిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News