Share News

Gold Donation to Lord Venkateswara: శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

ABN , Publish Date - Aug 21 , 2025 | 06:13 AM

అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలు పలుమార్లు సమర్పించుకున్నట్లు శాసనాలు..

Gold Donation to Lord Venkateswara: శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

  • ఎవరా భక్తుడు.. ఏమా విశేషం?

  • రూ.140 కోట్ల విలువైన భారీ కానుక

  • ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి

  • టీటీడీ ఖజానాలో 10 వేల కిలోలకు పైగా స్వర్ణం

  • స్వామి అలంకరణకు 1100 స్వర్ణాభరణాలు

(అమరావతి/తిరుమల - ఆంధ్రజ్యోతి): అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలు పలుమార్లు సమర్పించుకున్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత... మైసూరు మహారాజ వంశీయులు అనేక సందర్భాల్లో ఏడుకొండల వెంకన్నకు ఎంతో విలువైన బంగారు నగలు కానుకగా ఇచ్చారు. వాటిని ఇప్పటికీ స్వామికి అలంకరిస్తూ ఉన్నారు. వేడుకల్లో ఉపయోగిస్తున్నారు. ఇక... ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి వజ్ర కిరీటం చేయించారు. దాని విలువ రూ.22 కోట్లు! శ్రీవారికి సంబంధించిన వివిధ ట్రస్టులకు పదికోట్లు, ఇరవై కోట్లు విరాళాలు తరచూ అందుతూనే ఉన్నాయి. కానీ... ఇప్పుడు ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని వెంకన్నకు సమర్పిస్తున్నారు. మంగళవారం పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఈ విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ‘ఎవరా అజ్ఞాత భక్తుడు?’ అనే చర్చ కూడా మొదలైంది. ‘‘వెంకటేశ్వరస్వామి భక్తుడొకరు కంపెనీ పెట్టారు. అది చాలా పెద్దస్థాయికి వెళ్లింది. ఆ కంపెనీలో 60 శాతం విక్రయించగా ఆయనకు ఆరేడువేల కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సంపద తనకు వెంకన్న ఇచ్చిందే అని ఆయన నమ్మారు. అందులో కొంత స్వామికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇస్తున్నారు. దీని విలువ రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఉంటుంది. ఆయన నన్ను కలిసి ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారు. తన పేరు మాత్రం బయటికి చెప్పొద్దని కోరారు. వెంకటేశ్వర స్వామికి రోజుకు 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారు. ఆ భక్తుడి ద్వారా అంతకంటే ఒక్క కిలో ఎక్కువ ఇప్పించుకోవాలని స్వామి నిర్ణయించుకున్నట్లుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. స్వామికి 120 కిలోల బంగారం అలంకరిస్తారని తనకూ తెలియదని, 121 కిలోలు ఇవ్వాలని తన మనసుకు తోచడం విశేషమని ఆ అజ్ఞాత భక్తుడు తనకు చెప్పారని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం... ఆ అజ్ఞాత భక్తుడెవరో తెలిసే అవకాశం లేనట్లే. ఇక... ఆయన శ్రీవారికి 121 కిలోల బంగారాన్ని ఎప్పుడు ఇస్తున్నారు? ఏ రూపంలో ఇస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. శ్రీవారికి అందనున్న ఈ భారీ కానుకకు సంబంధించి టీటీడీ అధికారులకు సీఎంవో నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.


బంగారు స్వామి...

చరిత్రలో రాజులు, మహంతులు, రాజ వంశీకులు, బ్రిటిష్‌ పాలకులతోపాటు నవాబులూ శ్రీవారికి లెక్కలేనన్ని స్వర్ణాభరణాలు సమర్పించారు. ఇటీవలి కాలానికి వస్తే... 2009లో గాలి జనార్దన్‌ రెడ్డి రూ.42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించాడు. అధిక బరువు ఉన్న నేపథ్యంలో దీనిని వాడటం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో... కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5.2 కోట్ల విలువైన 19.072 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందించి మొక్కు తీర్చుకున్నారు. ప్రవాసాంధ్రుడు రామలింగరాజు ఇచ్చిన రూ.11 కోట్ల విరాళంతో శ్రీవారికి నూతన సహస్రనామ కాసుల బంగారు హారాన్ని తయారు చేయించారు. మొత్తంగా శ్రీవారిని అలంకరించేందుకు సుమారు 1100 బంగారు ఆభరణాలు, 376 వజ్ర వైడూర్యాల నగలు ఉన్నాయి. బంగారు ఆభరణాల కానుకలు ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో... టీటీడీ కొన్ని నియంత్రణలు విధించింది. ముందస్తు అనుమతితో కొన్ని నిబంధనల మేరకు మాత్రమే ఈ కానుకలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హుండీ ద్వారా బంగారు కానుకలు రావడం ఎక్కువైంది. ఏటా హుండీ ద్వారానే సుమారు టన్ను బంగారం వస్తున్నట్లు సమాచారం. అలంకరణలకు ఉపయోగించేవి మాత్రం అలా ఉంచి... ఇతర ఆభరణాలు, కానుకలను 2010 వరకు మింట్‌ ద్వారా కరిగించి భక్తులకు విక్రయించేవారు. ఆ తరువాత బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయటం మొదలుపెట్టారు. మొదటిసారిగా 2010 మే 23వ తేదిన 1075 కిలోల బంగారాన్ని డిపాజిట్‌ చేశారు. 2022 సెప్టెంబరు 30వ తేదీ నాటి లెక్కల ప్రకారం శ్రీవారి బంగారు డిపాజిట్లు 10,258 కేజీలు ఉన్నట్లు సమాచారం!

Updated Date - Aug 21 , 2025 | 06:31 AM