Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర చిరస్మరణీయం: పవన్
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:43 PM
ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొనియాడారు. పాలనా దక్షతతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని పరుగులు పెట్టించాయని.. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయమని కీర్తించారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి సెప్టెంబర్ 1, 2025 నాటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు విజనరీ నేత. పాలనలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా వాటిని సవాళ్ళుగా స్వీకరించి ముందడుగు వేశారు. 90ల్లో దూరదృష్టితో ఐటీకి పెద్ద పీట వేయడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల నుంచి ఐటీ ఉద్యోగులు వచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలోని కొండగుట్టలను ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. రైతు బజార్లు ఏర్పాటు, డ్వాక్రా సంఘాల స్థాపన, పేదలకు వెలుగు ప్రాజెక్ట్ ప్రారంభం, మీసేవా కేంద్రాలు ఏర్పాటు ఇలా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశారు. ముందుచూపుతో దూరదృష్టితో అభివృద్ధి పథకాలు అమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారన్నారు. పాలనలో ఎదురైన ప్రతికూలతలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
రాష్ట్ర విభజన అనంతరం క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లారు. ప్రజా రాజధానిగా అమరావతి, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ సహా పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా 2014లో పాలన మొదలుపెట్టారు. అనంతరం 2024లోనూ మరింత క్లిష్ట పరిస్థితుల్లో పాలన పగ్గాలు తీసుకున్నారు. కఠిన సవాళ్ళు ముందున్నా దృఢ చిత్తంతో పాలన వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు పెద్ద మొత్తాల్లో నిధులు సాధించడం చంద్రబాబు గారి నాయకత్వ లక్షణాలు తెలియచేస్తాయి. పాలనా వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు సత్వర సేవలు అందేలా చేస్తున్నారు. దార్శనికత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తోందని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మందు బాబులకు మరో గుడ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్వచ్ఛాంధ్ర ఆవార్డుల ప్రధానం
For More AP News And Telugu News