Minister Anam VS YSRCP: హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:39 PM
ఐదేళ్లు దేవుళ్లని కూడా దోచుకున్నందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు పక్కన పెట్టారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన హిందూ దేవాలయాలు, ఆచారాలను కూటమి ప్రభుత్వం పరిరక్షించి ప్రాధాన్యం కల్పిస్తోందనే కడుపుమంటతో జగన్ విష ప్రచారానికి దిగారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు.
అమరావతి, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): భగవంతుడుని, హిందూ ధర్మ ఆచారాలను వైసీపీ నేతలు రాజకీయ వైకుంఠపాళిలోకి లాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని విమర్శించారు. అలాంటి పార్టీ హిందువుల మీద రాజకీయ క్రీడ నడపాలనుకోవటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దేవాలయాలు, పాలకమండళ్లు, దేవాదాయ శాఖపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శలపాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను దేవుడు కూడా క్షమించరని హితవు పలికారు. సాక్ష్యాత్తూ వైకుంఠ వాసి మీద జరిగే దుష్ప్రచారంపై వివరణ ఇవ్వాల్సి రావటం తనకూ బాధగానే ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయం, పార్టీ మనుగడ కోసం సైకోలా మారి దేవుణ్ణి కూడా జగన్ దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేరుగా ఆరోపణ వస్తే ఎప్పుడూ జగన్ ఎందుకు ఎదుర్కొలేదని ప్రశ్నించారు. జగన్‌పై ఆరోపణ వస్తే, ఆ అంశాన్ని మళ్లించటానికి దైవ దూషణలకు దిగటం ఆయన పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఐదేళ్లు దేవుళ్లని కూడా దోచుకున్నందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు పక్కన పెట్టారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన హిందూ దేవాలయాలు, ఆచారాలను కూటమి ప్రభుత్వం పరిరక్షించి ప్రాధాన్యం కల్పిస్తోందనే కడుపుమంటతో జగన్ విషప్రచారానికి దిగారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖలో ఉన్న దాదాపు 500 ఖాళీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని ప్రకటించారు. సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేసి దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. తిరుమల శ్రీవారి ప్రాధాన్యం తగ్గించేందుకే నాస్తికుడైన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే నాడు జగన్ టీటీడీ చైర్మన్‌గా నియమించారని ధ్వజమెత్తారు. ప్రతీ కార్యక్రమంలో గత జగన్ ప్రభుత్వ పాలన అవినీతి బయటపడుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు పవన్ కల్యాణ్..
Read Latest AP News And Telugu News