Jagan Birthday Celebrations: జగన్ బర్త్‌డే వేడుక.. వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు..!
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:54 PM
వైసీపీలో మరోసారి కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53వ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన బర్త్‌డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి.
కర్నూలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP)లో మరోసారి నేతల మధ్య తీవ్ర విభేదాలు, కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) 53వ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన బర్త్‌డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన వివాదం వైసీపీ శ్రేణుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. జగన్ పుట్టినరోజు వేడుకను వేర్వేరుగా నిర్వహించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రుద్ర గౌడ్‌లు వేర్వేరుగా పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ వివాదం ఇప్పుడు వైసీపీలో అంతర్గత విభేదాలకు నాంది పలికింది. ఫ్యాన్ పార్టీ నేతల మధ్య నెలకొన్న రగడ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కుమ్ములాటలతో వైసీపీ కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు.
పార్టీలో అగ్రనాయకులే ఇలా వేర్వేరుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడమెంటనీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పార్టీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇప్పటికైనా హైకమాండ్ పట్టించుకోని నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.
చిత్తూరులో భగ్గుమన్న వర్గ విభేదాలు
జగన్ జన్మదిన వేడుకల నేపథ్యంలో చిత్తూరు వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వర్గాలు విడిపోయి పోటాపోటీగా వేడుకలు నిర్వహించారు. అసంతృప్తి వర్గానికి డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అండదండలు ఉన్నాయని సమాచారం. ఆయనకు మద్దతుగా పలువురు కీలక నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్‌లో వైసీపీకి ప్రాతినిధ్యం ఉన్న డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గిరింపేట వద్ద జగన్ పుట్టినరోజు సంబరాలు జరిగాయి.
అసంతృప్తి వాదులు మొత్తం చిత్తూరు జిల్లా వైసీపీ అగ్రనేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధేయులే ఉండటం గమనార్హం. గిరింపేట వద్ద చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన బ్యానర్‌లలో చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డి ఫొటో ఎక్కడ కనిపించలేదు. ఇప్పటివరకు తమ పార్టీలో వర్గాలు లేవని.. సమన్వయకర్త తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వర్గాలుగా ఏర్పడిన ఆశ్చర్య పోవాల్సిన పని లేదని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు
గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్
Read Latest AP News And Telugu News