Vijayawada GGH Postmortem Scam: శవాలపై దోపిడీ.. ప్రభుత్వాస్పత్రిలో రాబందుల రాజ్యం!
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:44 AM
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగే పోస్టుమార్టానికి వచ్చిన మృతదేహాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువ. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. మానవత్వంతో వ్యవహరించాల్సిన పోస్టుమార్టం సిబ్బంది రాబందుల్లా డబ్బు కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
» జీజీహెచ్‌లోని పోస్టుమార్టంలో శవబేరాలు
» ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూళ్లు
» కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్
» పంచనామాకు టోపీ చాస్తున్న పోలీసులు
» పేదలనూ వదలకుండా పీడిస్తున్న సిబ్బంది
» ప్రమాదాలు, ఆత్మహత్య మృతదేహాలకైతే మరీ ఎక్కువ
నెల కిందట నగరంలోని రాణిగారితోటకు చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు (Rani Gari Thota Construction Worker) విధులు నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసు కేసు నమోదు కావడంతో పోస్టుమార్టానికి తరలించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నవారి వద్ద అక్కడి సిబ్బంది డబ్బు డిమాండ్ చేశారు. రూ.7 వేలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తామని చెప్పడంతో పేదరికంలో ఉన్న ఆ కుటుంబం రూ.4 వేలు ఇచ్చి పోస్టుమార్టం చేయించుకుంది.
ప్రాణం పోసేవాడు డాక్టర్ (Doctor), ప్రాణంపోయినా పీక్కుతినే వాళ్లను ఏమంటారు. పైగా కఠిక పేదరికాన్ని అనుభవించే పేదలను పిండేసే వాళ్లను ఏమని పిలవాలి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం వద్ద రోజూ శవాలపై జరిగే పైశాచిక వ్యవహారాలివి. పోస్టుమార్టానికీ ఓ రేటు, పంచనామాకు మరో రేటు, ఫొటోలు తీసేందుకు కొంత, మృతదేహాన్ని నిల్వ చేసేందుకు ఇంకొంత... ఇలా అందినకాడికి దండుకుంటున్నారు. అసలే ఇంటి మనిషిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నవారికే ఈ దోపిడీ మరింత కుంగదీస్తోంది.
వారం కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన యువకుడు వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. పోస్టుమార్టం చేయాలంటే రూ.8 వేలు అవుతుందని సిబ్బంది నిర్మొహమాటంగా అడగటంతో పక్కనే ఉన్న మృతుడి స్నేహితులు సుమారు రూ.5 వేలు ఇచ్చి పోస్టుమార్టం చేయించుకున్నారు.
విజయవాడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో (Vijayawada Government Hospital) జరిగే పోస్టుమార్టానికి వచ్చిన మృతదేహాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువ. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. మానవత్వంతో వ్యవహరించాల్సిన పోస్టుమార్టం సిబ్బంది రాబందుల్లా డబ్బు కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని నిల్వ చేయడానికి, వారికి కావాల్సిన వస్తువులు సమకూర్చడానికి అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే, గది శుభ్రం చేయడానికి, ఫొటోల కోసం అంటూ అనేక రకాల పేర్లు చెప్పి దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకుని పోలీసు కేసు నమోదై పోస్టుమార్టానికి వచ్చే మృతుల కుటుంబసభ్యుల నుంచి అధికమొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పంచానామాకు...
పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు పంచనామా పోలీసులే (Police) ఇవ్వాలి. ఈ పంచానామా ఇస్తేనే ప్రమాదాలు జరిగిన వారికి బీమా, ఇతర పాలసీల ద్వారా రావాల్సిన డబ్బు జమ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో పోస్టుమార్టం సిబ్బందితో కలిసి పోలీసులూ డబ్బు తీసుకుంటున్నారని మృతుల కుటుంబీకులు, స్నేహితులు ఆరోవస్తున్నారు. పోలీసులకు డబ్బు ఇవ్వకపోతే పంచనామా ఏ విధంగా రాస్తారోనని భయపడి అడిగినంత ముట్టజెబుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారైతే పర్వాలేదు. కానీ, పేదవారు మాత్రం సిబ్బందికి, పోలీసులకు అడిగినంత ఇవ్వలేక బేరాలు మాట్లాడుకుంటున్నారు.
దు:ఖంలో ఉన్నవారి వద్ద దండుకుంటున్నారు మృతుడి స్నేహితుడు అర్జున్
ఇంట్లో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబీకులు ఎంత దు:ఖంలో ఉంటారో అందరికీ తెలుసు. అందులోనూ వయసులో ఉన్నవారు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం అటువంటి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం దుర్మార్గం. ప్రభుత్వాలు జీతాలు చెల్లిస్తున్నా శవాలపై దండుకుంటున్నారు. ఆర్థికంగా ఉన్నవారు బాధలో పట్టించుకోరు. అంత మొత్తంలో అంటే పేదలు ఎలా ఇచ్చుకోగలరు. ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ సిక్స్.. గ్రాండ్ సక్సెస్
ట్రైబ్యునల్ ఏర్పాటులో జాప్యం ఎందుకు
Read Latest Andhra Pradesh News and National News