Anantapur: సూపర్ సిక్స్.. గ్రాండ్ సక్సెస్
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:47 AM
టీడీపీ కూటమి పార్టీలు అనంతపురం జిల్లా కేంద్రంలో సమష్టిగా నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను...
సుపరిపాలనకు ప్రజామోదం.. అంచనాలకు మించి పోటెత్తిన జనం
సభ ముగుస్తున్నా వస్తూనే ఉన్న వైనం
ఆద్యంతం కేరింతలు, చప్పట్లతో మద్దతు
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపైనే బాబు, పవన్, మాధవ్ ప్రసంగాలు
లోకేశ్, బాలకృష్ణ లేని లోటు స్పష్టం
అనంతపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి పార్టీలు అనంతపురం జిల్లా కేంద్రంలో సమష్టిగా నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను.. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఈ సభ జరిపారు. దీనికి అంచనాలకు మించి జనం పోటెత్తారు. సభ ప్రాంగణమే కాకుండా.. పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటుచూసినా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. వేడుకల నేపథ్యంలో అనంతపురం అంతర్గత రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అందరూ నగర శివారులోని సభ వైపు ఉదయం 11 గంటలకే వెళ్లిపోయారు. ఈ సభకు 3.50 లక్షల మంది వస్తారని అంచనా వేసి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కానీ 50 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో చాలామంది బయటే ఉండిపోవలసి వచ్చింది. సాయంత్రం సభ ముగిసే సమయంలో కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో జనం అక్కడకు చేరుకుంటూనే ఉన్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలిరావడం తమ ప్రభుత్వ సుపరిపాలనకు అద్దం పట్టిందని.. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రభుత్వానికి ప్రజామోదం లభించిందని కూటమి నాయకులు వ్యాఖ్యానించారు. భానుడి సెగలను సైతం లెక్కచేయకుండా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూర్చున్న చోటే ఉండిపోయారు. విజయోత్సవ సభను క్రమశిక్షణతో విజయవంతం చేయడం ప్రత్యేకత. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒకేసారి వేదికపైకి వచ్చారు. ఈ ముగ్గురి ప్రసంగాలు ఆసాంతం.. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే సాగాయి. రాజకీయ విమర్శలు చేసినప్పటికీ.. అవి సహేతుకమైనవేనని ప్రజలు చర్చించుకున్నారు. జనం కేరింతలు, చప్పట్లు, జెండాల రెపరెపలతో వారి ప్రసంగాలకు మద్దతు తెలిపారు.
ఈ సభకు యువగళం సారథి, విద్యా మంత్రి లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతారని అందరూ భావించారు. పెద్దఎత్తున వారి కటౌట్లు, ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందు లోకేశ్ రావడం లేదనే సమాచారం అందింది. ఇది టీడీపీ శ్రేణులు, నేతలను ఒకింత నిరాశకు గురిచేసింది. అనారోగ్యంతో బాలకృష్ణ కూడా సభకు రాలేదు. ఈ ఇద్దరు లేని లోటు స్పష్టంగా కనిపించింది. లోకేశ్ రాకపోవడానికి ప్రధాన కారణాన్ని సీఎం వేదిక పైనుంచే తెలియజేశారు. నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా రాష్ర్టానికి తీసుకొచ్చే గురుతర బాధ్యతను లోకేశ్ నిర్వర్తిస్తున్నారని తెలిపారు. బాలకృష్ణ అనారోగ్యం కారణంగా రాలేదని చెప్పారు.
ఏరోస్పేస్ హబ్‌గా అనంత: పల్లా
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్‌గా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుర్తుచేశారు. చంద్రబాబు నాయకత్వంలో కియ మోటార్స్ రాకతో ఈ ప్రాంతం ఆటోమొబైల్ హబ్‌గానూ అభివృద్ధి చెందిందన్నారు. అనంతపురం త్వరలో ఏరోస్పేస్ హబ్‌గా మారబోతోందని తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందన్నారు.జగన్ ఐదేళ్లు ఫేక్‌ప్రచారంతో మూడు ప్రాం తాల మధ్య చిచ్చుపెట్టి కాలం గడిపారని విమర్శించారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమరావతిలో వరదలు, రాయలసీమలో రైతుల ఆత్మహత్యలంటూ అబద్ధపు ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు. ప్రజల జీవనప్రమాణాలను పెంచుతూ.. లోకేశ్ యువగళం ఆలోచనలతో, పవన్ కల్యాణ్ నిస్వార్థ ఆలోచనతో, బీజేపీ సహకారంతో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
