Share News

AP High Court: ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:05 AM

సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 118 మేరకు వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

AP High Court: ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు

  • ఎంతకాలంలోగా ఏర్పాటు చేస్తారో చెప్పండి?

  • సీఆర్‌డీఏ చట్టంలో దాని ప్రస్తావన ఉందికదా!

  • పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి

  • రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 118 మేరకు వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సీఆర్‌డీఏ పరిధిలో వివిధ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని, ఈ క్రమంలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ఓ వేదిక ఉండాలి కదా? అని ప్రశ్నించింది. సీఆర్‌డీఏ చట్టంలో కూడా ట్రైబ్యునల్‌ ఏర్పాటు గురించి ప్రస్తావించారని, ఆ మేరకు దానిని ఏర్పాటు చేసి, చైౖర్మన్‌, సభ్యులను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించింది. ఎంతకాలంలోగా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారో స్పష్టతనిస్తూ కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ అమలు సమయంలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 118 ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడంతో పాటు చైర్మన్‌, సభ్యులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రైట్స్‌(ఎ్‌సపీసీపీఈఆర్‌) కార్యదర్శి, రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి బదులిస్తూ... ‘ట్రైబ్యునల్‌ ఏర్పాటు వ్యవహారం సీఆర్‌డీఏ కమిషనర్‌ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం’ అని తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 06:06 AM