AP High Court: ఫొటో ప్రదర్శనపై నిషేధం ఎక్కడుంది
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:45 AM
ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి ఫొటో ప్రదర్శించడంపై నిషేధం ఎక్కడ ఉంది? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారు
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపముఖ్యమంత్రి చిత్రంపై పిల్ కొట్టేసిన హైకోర్టు
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి ఫొటో ప్రదర్శించడంపై నిషేధం ఎక్కడ ఉంది? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో వ్యాజ్యం వేశారని ఆక్షేపిస్తూ పిల్‌ను కొట్టివేసింది. ఇలాంటివి కాకుండా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విషయాలను ఎంచుకొని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వేయాలని హితవు పలికింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఫొటోల ప్రదర్శన విషయంలో నిర్దిష్ట జీవోలు, మార్గదర్శకాలు, నిబంధనలు లేవని సమాచార పౌర సంబంధాల శాఖ ఆర్‌టీఐ కింద చేసిన దరఖాస్తుకు సమాచారం ఇచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 164లో ఉపముఖ్యమంత్రి పోస్టును నిర్దిష్టంగా గుర్తించలేదు’ అని పేర్కొన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఉపముఖ్యమంత్రి ఫొటో ప్రదర్శించడంపై నిషేధం ఎక్కడ ఉందో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ పిల్‌ను కొట్టివేసింది.