Srinivasa Varma on Modi Govt: మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారు: శ్రీనివాసవర్మ
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:58 PM
ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
విజయవాడ, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): నరేంద్రమోదీ (Narendra Modi) ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ (Srinivasa Varma) వ్యాఖ్యానించారు. ఈరోజు స్వదేశీ అనేది ఒక ఆర్థికపరమైన ఆలోచనే కాదని.. ఆత్మగౌరవానికి, దేశానికి సంబంధించిన విషయం కూడా అని ఉద్ఘాటించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే దేశంలో స్వదేశీ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఖాదీ సంతను శ్రీనివాసవర్మ ఇవాళ(శుక్రవారం) సందర్శించారు. ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి.. ఆయా ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్రమంత్రి. ఖాదీ సంత ముగింపు సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మధుకర్, అడ్డూరి శ్రీరామ్, రమేష్ నాయుడు, కిలారు దిలీప్, పోతుల సునీత, ఇతర నేతలు , నాయకులు హాజరయ్యారు. ఆహుతులు, ఉత్పత్తిదారులు, సందర్శకులతో స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామంటూ బీజేపీ నేత బిట్ర వెంకట శివన్నారాయణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.
ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది...
భారతదేశం శక్తివంతమైన దేశంగా తీసుకువెళ్లేందుకు మనమంతా కలిసి పని చేయాలని సూచించారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. గత పాలకులు స్థానిక ఉత్పత్తులని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని తెలిపారు. విదేశీ వస్తువులు, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున అనుమతించడంతో.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా.. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని వివరించారు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.
ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగాయి..
స్వదేశీ ఉద్యమాన్ని ప్రజలకు కూడా వివరించి, వారిలో చైతన్యం తీసుకు రావాలని సూచించారు. మన చుట్టూ పక్కల తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసే ఆలోచన రావాలని మార్గనిర్దేశం చేశారు. 11వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానానికి ప్రధాని మోదీ తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించడం, దేశ భక్తిని పెంపొందించడం ద్వారా మోదీ తన లక్ష్యాలను సాధిస్తున్నారని తెలిపారు. దేశంలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు బలంగా పెరిగాయంటే మోదీ ఎలా ప్రోత్సహించారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశ ప్రజలంతా స్వదేశీ ఉద్యమానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకతను మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించారని గుర్తుచేశారు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.
యువతకు ప్రధాని మోదీ చేయూత
‘మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, MSME ప్రోత్సాహాకాలు, ఆత్మ నిర్భర్ ప్రోత్సాహం ద్వారా యువతకు ప్రధాని మోదీ చేయూతను ఇచ్చారు. నేడు రక్షణ రంగాన్ని కూడా బలోపేతం చేసి, ప్రపంచ దేశాలకు మన దేశ గొప్పతనం చాటి చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి టాయిలెట్స్ గురించి మోదీ మాట్లాడితే కొంతమంది హేళన చేశారు. నేడు మోదీ చేపట్టిన సంస్కరణలతో వచ్చిన మార్పులను అనేక మంది ప్రశంసిస్తున్నారు. ఖాదీ ఉత్పత్తుల వాడకం పెరగడం ద్వారా.. మన ప్రాంత చేనేత కార్మికులకు ఆదాయం పెరిగింది. మన దేశంలో మార్కెట్ చేస్తున్న చైనా, అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆదాయం పెరుగుతుంది. విదేశీ కంపెనీల ఉత్పత్తులను మనం కొంటే.. వారు ఆర్థికంగా బలపడుతున్నారు. ఆ డబ్బుతోనే మన శత్రుదేశమైన పాకిస్తాన్‌కి సాయం అందిస్తూ.. మన మీదకే వస్తున్నారు. మన డబ్బుతోనే మన మీదకు వచ్చే దేశాలను మనం ప్రోత్సహించడం సమంజసం కాదు. మన దేశ పర్యాటకులను చంపేస్తున్నారు.. ఆంక్షలు పెడుతున్నారు.. అలాంటి దేశాల ఆదాయాలకు మనం సాయం అందించకూడదు’ అని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి..
‘భారతీయులంతా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి, వాటినే వినియోగించాలి. ఓకల్ ఫర్ లోకల్ అనే మోదీ నినాదం గ్రామాలకు చేరింది. 2014 ముందు ఉన్న కాంగ్రెస్ పాలకులు ఈ దేశంలో స్వదేశీ ఉత్పత్తులు, గ్రామీణ ఉత్పత్తులను నిర్వీర్యం చేశారు. సమాజంలో అట్టడుగున ప్రజల వికాసమే స్వదేశీ అభివృద్ధి అని దీనదయాళ్ ఎప్పుడో చెప్పారు. వర్షాలు , వరదలు వచ్చినా.. ఈ ఖాదీ సంతలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి చేతి ఉత్పత్తుల దారులు కూడా ఈ సంతలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్న చేతి వృత్తుల వారినే మనం ప్రోత్సహించాలి.
తేనెటీగల పెంపకానికి రూ.500 కోట్లు ప్రధాని మోదీ ఇవ్వడం వల్లే.. ఆ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి విశ్వకర్మ యోజన పథకాన్ని తెచ్చి రూ.13వేల కోట్లను మోదీ కేటాయించారు. దేశంలో మోదీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం స్వదేశీ ప్రభుత్వం అని అందరూ గమనించాలి. మన ఆత్మగౌరవాన్ని ప్రేరేపించేలా, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని క్రియాశీలకంగా మార్చే మోదీ సంకల్పానికి మనమంతా బాధ్యతగా సహకరించాలి. మోదీ సారథ్యంలోనే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపే కాదు.. ఆర్థికంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకుటుంది’ అని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News