Harassment in Schools: కీచక టీచర్లు.. పాఠశాలల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:31 AM
పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న అంశాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లోకేశ్ సోషల్ ఆడిట్' పేరుతో సమగ్ర విషయ సేక రణ నిర్వహించాలని ఆదేశించగా, కొద్దిరోజు లుగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది.
» పాఠశాలల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు
» జిల్లాలో జరుగుతున్న సోషల్ ఆడిట్లో నిజాలు
» నందిగామ, జగ్గయ్యపేట విద్యార్థినుల ఫిర్యాదులు
» హెచ్ఎంలతో ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం
» సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు హెచ్చరికలు
» కీచకులపై తీసుకోవాలనే చర్యలు డిమాండ్
నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలోని చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిపై 25 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. తమను చెప్పకోకూడని చోట తాకుతూ, తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ లేఖలో వారంతా పేర్కొన్నారు. తమతో పాటు ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని, వారంతా ధైర్యంచేసి చెప్పుకోలేకపోతున్నారన్నారు. ఆ ఉపాధ్యాయుడి గురించి కొందరు ఉపాధ్యాయినులకు చెప్పామని, వారు హెచ్ఎంకు సమాచారం ఇచ్చినా స్పందన లేదన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని మరో పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు కూడా ఒక ఉపాధ్యాయుడిపై ఇలాంటి ఫిర్యాదే చేశారు.
..ఇటీవల జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన సోషల్ ఆడిట్‌లో బయటపడిన నిజాలివి. కొన్ని పాఠశాలల్లో మదమెక్కిన మానవమృగాలు చేస్తున్న వికృత చేష్టల చిట్టా ఇది. కేవలం 50 పాఠశాలల్లో జరిగిన సోషల్ ఆడిట్‌లోనే ఇన్ని ఫిర్యాదులు వస్తుండగా, జిల్లా అంతటా పరిస్థితి ఎలా ఉందనే చర్చ మొదలైంది. తమ సమస్యల కోసం నిత్యం ఉద్యమాలు నిర్వహించే ఉపాధ్యాయ సంఘాలు ఈ పరిస్థితులపై మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.
నందిగామ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న అంశాలను అధ్యయనం చేసేందుకు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సోషల్ ఆడిట్' (Social Audit in Schools) పేరుతో సమగ్ర విషయ సేకరణ నిర్వహించాలని ఆదేశించగా, కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతోనూ, తల్లిదండ్రులతోనూ వ్యక్తిగతంగా సమావేశమై పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులు సలహాలు తీసుకుంటున్నారు. సాధారణ సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ సోషల్ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి.
ఆడిట్ జరిగిన ఆయా పాఠశాలల హెచ్ఎంలతో ఇటీవల విజయవాడలో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. పాఠశాలలవారీగా జరిగిన పలు అకృత్యాలను ఆడిట్ బృందం వివరించింది. ఆయా హెచ్ఎంలను హెచ్చరించింది. కీచక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్ఎంలు తెలి పారు. ఇంకా ఎంతోమంది విద్యార్థినులు కీచక ఉపాధ్యాయుల చేతిలో నలిగిపోతున్నారో తెలియాల్సి ఉంది. కాగా, ఆడిట్ బృందాలు కొందరు విద్యార్థుల బ్యాగులు, జేబులు పరిశీ లించగా, గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు కనిపించాయి. వ్యసనాలకు అలవాటు పడిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతోనే మద్యం, గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు తెప్పించుకున్నట్లు కూడా తెలిసింది. ఆ అంశాన్ని అలుసుగా తీసుకుని విద్యార్థులు కూడా ఆ అలవాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
కీచకులకు అండదండలా?
పాఠశాలల్లో కీచక వ్యవహారాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై అధికారులు ఉదాసీనంగా ఉండటానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కారణమని తెలుస్తోంది. కీచక ఉపాధ్యాయులు చేస్తున్న చేష్టలు తెలిసినప్పటికీ ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉన్నతాధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఏదైనా అంటే.. సంఘాలు వెనుకేసుకొస్తాయన్న భయంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌లో బయట పడిన కీచక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News