Kolikapudi Srinivasa Rao: అమరావతిపై జగన్ మీడియా అసత్య ప్రచారం.. కొలికపూడి ధ్వజం
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:58 PM
ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది నిజం కాదా అని కొలికపూడి ప్రశ్నించారు.
ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): అమరావతిపై విషపు రాతలు రాస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పైశాచిక ఆనందం పొందుతున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై చర్చకు తాను సిద్ధమని.. జగన్ మోహన్ రెడ్డి సిద్ధమా, లేకపోతే వైసీపీ నుంచి ఎవరూ వచ్చినా తాను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిందని జగన్ తన మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
2014లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని తెలిపారు. అమరావతికి అప్పటి మిత్రపక్షమైన బీజేపీ మద్దతు పలకగా బయట నుంచి జనసేన మద్దతు పలికిందని.. అసెంబ్లీలో వైసీపీ కూడా మద్దతు పలికిందని గుర్తుచేశారు. జగన్ తన సొంత ఇంటిని తాడేపల్లిలో కట్టుకున్నాడని.. తాడేపల్లిలో జగన్ ఇల్లు మునిగిందా అని సూటిగా ప్రశ్నించారు. 400 ఏళ్ల చరిత్ర గల హైదరాబాదే చిన్నపాటి వర్షానికి అతలాకుతలం అవుతుంటే.. సముద్ర మట్టానికి అత్యంత దగ్గరగా ఉండే అమరావతిలో చిన్నపాటి వర్షం కురిస్తే.. ఆ వర్షానికే అమరావతి మునిగిందని జగన్ చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
చంద్రబాబు దూర దృష్టితో ఆలోచించి కొండవీటి వాగు నిర్మాణాన్ని చేపట్టి ఆ వాగు ద్వారా వరద నీటిని నదిలోకి మరలించటం జగన్‌కి తెలియదా అని నిలదీశారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రళయాలు తప్పవని ముంబై ,జమ్మూ కాశ్మీర్‌లలో సంభవించిన వరదలే సాక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
స్త్రీ శక్తి ఉచిత బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే కొలికపూడి
మరోవైపు.. తిరువూరు బస్టాండ్ నుంచి విజయవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొంత దూరం ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్నప్రయాణాన్ని పరిశీలించారు. తిరువూరు నుంచి విజయవాడ వరకు ఉచితంగా బస్సు ప్రయాణంతో మహిళలకు ఎంత సొమ్ము ఆదాయం అవుతుందని మహిళ ప్రయాణికులను ఎమ్మెల్యే కొలికపూడి అడిగి తెలుసుకున్నారు. గతంలో తిరువూరు నుంచి విజయవాడకు వెళ్లి రావాలంటే రూ.240లు ఖర్చు అవుతుందని మహిళలు తెలిపారు. వైద్యం కోసం నెలకు పలుమార్లు విజయవాడకు వెళ్లే వారికి, కాలేజీ చదువుల కోసం బస్సుల్లో తిరిగే వారికి ఉచిత ప్రయాణంతో చాలా లబ్ధి చేకూరుతుందని మహిళలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
Read Latest AP News and National News