Share News

TTD Fake Ghee Scam Case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:54 PM

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.

TTD  Fake Ghee Scam Case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
TTD Fake Ghee Scam Case

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో (TTD Fake Ghee Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇవాళ (సోమవారం) విచారించింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డిని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విచారించారు.


కల్తీ నెయ్యి కుంభకోణం జరిగిన సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం విచారణ చేపట్టారు.


ఈ విచారణలో అప్పట్లో నెయ్యి కాంట్రాక్టును మార్చిన అంశం, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, సంబంధిత వ్యక్తులతో జరిగిన చర్చలపై సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక సమాచారాన్ని చెవిరెడ్డి నుంచి సేకరించినట్లు సమాచారం.


ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరుస కేసుల్లో ఆయనపై విచారణ కొనసాగుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కల్తీ నెయ్యి కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 04:57 PM