Share News

Online Trading Scam: ఫేక్ యాప్‌లు, నకిలీ లింకులు… ఆశపడితే ఖాతాల్లో డబ్బే ఉండదు!

ABN , Publish Date - Aug 14 , 2025 | 08:11 AM

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్‌మెంటు పేరుతో నకిలీ యాప్‌లు ప్రవేశపెట్టి.. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ ఆశలు రేకెత్తించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.

Online Trading Scam: ఫేక్ యాప్‌లు, నకిలీ లింకులు… ఆశపడితే ఖాతాల్లో డబ్బే ఉండదు!
Fake apps scam in Kadapa

» సైబర్... టెర్రర్

» ఇన్వెస్ట్‌మెంటు పేరుతో బురిడీ

» ఆశపడితే.. బ్యాంకుల్లో నగదు ఖాళీ

» ఏడు నెలల్లో 700 ఫిర్యాదులు

» రూ.15 కోట్లకు పైగా స్వాహా

కడప క్రైం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్‌మెంటు (Cyber Investment) పేరుతో నకిలీ యాప్‌లు ప్రవేశపెట్టి.. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ ఆశలు రేకెత్తించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి మోసాలు జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.


ఇన్వెస్ట్‌మెంటు అంటే...

మనం పెట్టిన డబ్బులకు రెట్టింపు ట్రేడ్ తెస్తామంటూ పలురకాల యాప్‌లను సోషల్ మీడియా గ్రూపుల్లో పెడతారు. తొలుత నమ్మకం కలిగేలా కొందరికి రెట్టింపు డబ్బులు ఇస్తారు. వేలల్లో ఉన్న పెట్టుబడులను లక్షలు, కోట్లలో పెట్టేలా చేసి.. చివరికి ఆ యాప్‌ని మాయం చేస్తారు. దీంతో పెట్టుబడులు పెట్టిన వారంతా డబ్బులన్నీ పోగొట్టుకొని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నచందంగా లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పేర్లు, నకిలీ ఐడీ ప్రూప్‌లతో ఈ దందా నడపటంతో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి. కనీసం సైబర్ నేరగాళ్ల ఐడెంటిటీ కూడా ఎక్కడా కనిపించదు.


మోసపోయే వారంతా ఉద్యోగులు, విద్యావంతులే...

ఇన్వెస్ట్‌మెంటు దందాలో మోసపోతున్న వారిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యావంతులే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో వచ్చే యాప్‌లకు ఆకర్షితులై సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. లక్షల రూపాయలు ఇన్వెస్ట్‌మెంటు చేసి.. వారి ఖాతా వివరాలు చెప్పడంతో సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా మోసపోతున్న ఘటనలు జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఏడు నెలల్లోనే దాదాపు 700 ఫిర్యాదులు వచ్చాయంటే ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్ల మోసాలకు బలవుతున్నారో ఇట్టే తెలిసి పోతుంది. బాధితుల నుంచి దాదాపు రూ.15 కోట్లకు పైగా డబ్బులు స్వాహా చేయగా.. రూ.6కోట్లు వరకు పోలీసులు ఫ్రీజ్ చేశారు.


మోసపోయిన బాధితులు...

» కడపకు చెందిన ఓ ఉద్యోగి ఇన్వెస్ట్‌మెంటు యాప్ డౌన్‌లోడ్ చేసి.. రూ.20లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. లాభాల మాట దేవుడెరుగు.. తాను చెల్లించిన డబ్బు సైతం పోగొట్టుకున్నాడు. చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు.

» కడపకు చెందిన ఓ మహిళా ఉద్యోగి దాదాపు రూ.3లక్షలు ఇన్వెస్ట్‌మెంటులో పెట్టుబడులు పెట్టి పోగొట్టుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యాపారి, అలాగే అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పెట్టుబడులుగా లక్షల్లో పెట్టారు. అయితే వారు తమ డబ్బులు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు.

» మైదుకూరు చెందిన పలువురు వ్యాపారులు ఓ వ్యక్తిని నమ్మి యాప్‌లలో లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. చివరికి ఎవరు స్పందించ కపోవడంతో పెట్టుబడి పెట్టించిన వ్యక్తిపైనే వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా అత్యాశకు పోయి ఆన్‌లైన్ మోసాలకు బలి కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


అప్రమత్తంగా ఉండాలి... ఎస్పీ అశోక్ కుమార్

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయంటూ టెలిగ్రాం, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెట్టి మోసగిస్తున్నారు. ఈజీమనీ కోసం ఆశపడితే లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దు. టెలిగ్రామ్. వాట్సాప్ గ్రూపులకు ముందుగా ఇన్వెస్ట్ చేసి డబ్బు డబుల్ చేసుకోండి అంటూ లింకులు పంపుతారు. ఆ లింకులు ఓపెన్ చేసి వారు చెప్పినట్లు చేస్తే.. మొదట వెయ్యి, 2వేలకు డబుల్ లాభాలు వచ్చేలా చూపిస్తారు. ఇంకా ఎక్కువ పెడితే అధిక లాభాలు పొందుతారని నమ్మిస్తారు. ఆశపడి పెట్టుబడి పెట్టి మోసపోవద్దు. సెల్‌ఫోన్‌లకు వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దు. ఒకవేళ ఎవరైనా మోసపోయినట్లు గురిసే సెబర్ క్రైం సెల్ నెంబర్ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 08:11 AM