Share News

Keshav Payyavula: ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:05 AM

పులివెందుల ప్రజలకు భయం పోయింది... జగన్‌కు భయం పట్టుకుందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు.

Keshav Payyavula: ప్రజలకు భయం పోయింది..  జగన్‌కు పట్టుకుంది

  • వణుకు రేపిన పులివెందుల పోలింగ్‌

  • ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫైర్‌

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పులివెందుల ప్రజలకు భయం పోయింది... జగన్‌కు భయం పట్టుకుందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పులివెందుల ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేశారు. దీంతో తాడేపల్లి ప్యాలె్‌సలో ప్రకంపనాలు మొదలయ్యాయి. జగన్‌ నిరాశతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయనను పార్టీ క్యాడర్‌ వదిలిపోతోంది. ప్రజలు ఛీ కొడుతున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తుండడంతో ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు’’ అని పయ్యావుల పేర్కొన్నారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు 2020లో కడపలో 79 శాతం జడ్పీటీసీలు, 76 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయని గుర్తుచేశారు. ‘‘జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు మొదటి మూడేళ్లలో మూడు సార్లు, చివరిలో రెండు సార్లు పాత్రికేయ సమావేశాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ప్రతి రోజూ పాత్రికేయ సమావేశాలు పెడుతూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది’’ అని ప్రశ్నించారు. జగన్‌ మొదటిసారిగా రాజ్యాంగం, చట్టాల గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉందని, అసెంబ్లీకి వస్తే వాటిపై శిక్షణ కూడా పొందవచ్చునని వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో ఓట్ల చోరీకి మూలం జగన్‌ అని, సీఎంగా ఉండగా ఎన్నికల అక్రమాలకు వొడిగట్టారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు ఇది చివరి ఎన్నికలు అని జగన్‌ అంటున్నారు. అసలు జగన్‌ వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారో.. లేదో..? ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆయనకు అవకాశం ఉంటుందో లేదో?’’ అంటూ పయ్యావుల వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 14 , 2025 | 05:05 AM