Manikkam Thakur: జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:01 AM
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12.5శాతం మేర తేడా వచ్చిందంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు చిత్తశుద్ధి..
ఓడినా జగన్ ఆలోచనా విధానం ఏమాత్రం మారలేదు: చామల
అమరావతి/న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12.5శాతం మేర తేడా వచ్చిందంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే గురువారం తాము నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ బుధవారం సవాల్ విసిరారు. జగన్‌కు దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. షర్మిల నేతృత్వంలో విజయవాడలో గురువారం ఓట్ల చోరీపై ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్‌కు దమ్ముంటే ఓట్ల చోరీకి పాల్పడిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పోరాడాలని సవాల్ విసిరారు. ‘‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేయడం లేదు. ఆయన దేశం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు. జగన్‌లా మోదీని చూసి రాహుల్ భయపడరు. చంద్రబాబు- మోదీ, జగన్-అమిత్ షా, పవన్ కలిసి పనిచేస్తున్నారు. వీరంతా ఒక్కటే అనేది సుస్పష్టం. ఈ విషయం ఏపీ ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా జగన్ ఆలోచనా విధానం ఏమాత్రం మారలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చి విజయవాడలో జరిగే ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు.