Pemmasani: పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం.. పెమ్మసాని కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:56 AM
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్‌లో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్‌లో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 2014 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలా.. లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు పెమ్మసాని చంద్రశేఖర్.
అమరావతి బిల్లుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో ఏపీ ఎంతగానో నష్టపోయిందని విమర్శించారు. 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములు వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్‌ను జగన్ అండ్ కో నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ప్రణాళికా బద్ధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని తెలిపారు. వేల మంది అమరావతి నిర్మాణం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. హడ్కో ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని వివరించారు. కాగ్, పోస్టల్ బిల్డింగ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఏపీ అమరావతికి నిధులు ఇవ్వొద్దని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. అమరావతి బిల్లుకు చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు వచ్చాయని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News