Minister Nara Lokesh: మా ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవు
ABN , Publish Date - Jun 19 , 2025 | 02:53 PM
తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్‌లో ఉన్నాయని నారా లోకేష్ చెప్పారు.
ఢిల్లీ: జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఉన్న కేసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అధికారం తమకు ఇచ్చింది జగన్, ప్రతిపక్ష నేతలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి కాదని స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో మీడియాతో నారా లోకేష్ చిట్‌చాట్ చేశారు.
రాష్ట్రంలో సుపరిపాలన కోసం ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. వ్యక్తిగత కక్షసాధింపుల కోసం కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్‌బుక్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కుటుంబసభ్యులతో కలవడం మరిచిపోలేనిదని చెప్పారు. క్రమశిక్షణతో ఉండాలని, ప్రకృతిని ప్రేమించాలని దేవాన్ష్‌కి ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. రెండు రోజులపాటు పలువురు కేంద్రమంత్రులను ఢిల్లీలో కలిశానని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి చేయాలన్న తపన వాళ్లందరిలో కనిపించిందని చెప్పారు మంత్రి నారా లోకేష్.
ప్రధాని మోదీ సలహాలు, సూచనలు పాటిస్తాం..
రాజకీయాల్లో ఎలా ఎదగాలి, కార్యకర్తలతో ఎలా మెలగాలన్న విషయాలు మోదీ చాలా చక్కగా వివరించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధాని మోదీ సలహాలు, సూచనలను ఎప్పుడూ పాటిస్తానని చెప్పారు. ప్రధానితో దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశం తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. ప్రధానితో జరిగిన సమావేశం తనకు మంచి ప్రేరణ కలిగించిందని తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయని.. మనం మంచి హృదయంతో పని చేస్తే ప్రజలు వాటిని అర్థం చేసుకుంటారని ప్రధాని తనకు చెప్పారని గుర్తుచేశారు. మనం చేసే పనిలో ఉద్దేశం మంచిదైతే ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం ముఖ్యం కాదని.. ప్రజల హృదయాలకు దగ్గరయ్యే విధంగా వాటిని అమలు చేయడమే ముఖ్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రులు తమకు హామీ ఇచ్చారని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు. ఏపీలో విద్యారంగంలో చేపట్టబోయే సంస్కరణల గురించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చాలా ఆసక్తి చూపించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులతో కలిసి మరోసారి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నైపుణ్యంతో కూడిన విద్యను ఆంధ్రప్రదేశ్‌లో అందించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కి సంబంధించిన సంస్థతో చర్చలు జరిపామని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరుపైన నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి వాళ్ల పనితీరుకు సంబంధించిన నివేదికను వాళ్లకు అందజేస్తామని అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. దానికోసం వారికి మూడు నెలల సమయం ఇస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్..!
విద్యార్థులు విన్నపం.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
For AndhraPradesh News And Telugu News