Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:42 AM
Mandipalli Ramprasad Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

అమరావతి: అసెంబ్లీలో ఈ రోజు(సోమవారం) ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర’పై చర్చ జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ. 119.19కోట్లు కేటాయించిందని.. దానిలో ఖర్చు చేసింది రూ. 119.11 కోట్లు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 47 రోజుల్లో పూర్తిచేశారని చెప్పారు. ఈ మొత్తం నిధులను ఆర్ అండ్ బీ, స్పోర్ట్ శాఖ, జిల్లా కలెక్టర్‌ల ద్వారా ఖర్చు చేశారని గుర్తుచేశారు. స్పోర్ట్స్ కిట్‌ల కోసం రూ.38.55 కోట్లు, టీషర్ట్‌లు, క్యాప్‌ల కోసం రూ. 34.2 కోట్లు, జిల్లా కలెక్టర్‌లు, స్పోర్ట్స్ అకౌంట్స్‌కు రూ.40.93 కోట్లు డిపాజిట్ చేశారని .. దానిలో రూ.21 కోట్లు ఆఫ్ సైటింగ్ చార్జీల కోసం ఖర్చు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
భారీ స్థాయిలో అవినీతి..
ప్రైజ్ మనీ కోసం రూ.12.21 కోట్లు 41 రోజుల్లోనే ఖర్చు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడాశాఖ మంత్రిగా చెబుతున్నా పేద క్రీడాకారుల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని విమర్శించారు. ఈ విషయంపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని అన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. 45రోజుల్లోనే విజిలెన్స్ కమిటీకి, హౌస్ కమిటీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయట పెడుతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కల్పించుకుని మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్ర’పై కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు.
‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఏపీతో ఆడుకున్నారు: మాజీ మంత్రి అఖిల ప్రియ
అసెంబ్లీలో ఈ రోజు(సోమవారం) ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర’పై చర్చ జరిగింది. మాజీ మంత్రి అఖిల ప్రియ మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనే కార్యక్రమం క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా నిర్వహించాలని అఖిల ప్రియ అన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనే పేరుతో గత జగన్ ప్రభుత్వం ఆంధ్రతోనే ఆడుకుందని... కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని కాపాడుతుందని చెప్పారు. ఫుట్‌బాల్‌కు, వాలీబాల్‌కు కూడా తేడా తెలియని అప్పటి మంత్రి ఆర్కే రోజా రూ.120 కోట్లతో గేమ్స్ నిర్వహించారని విమర్శించారు. క్రీడాకారులను ఫోకస్ చేయడం ఎక్కడా జరగలేదని చెప్పారు. మిగతా స్కాంలకు ఈ స్కాంకు చాలా తేడా ఉందన్నారు. మిగతా స్కాంల మాదిరి కాకుండా కళ్ల ముందు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇందులో అవినీతి జరిగిందని ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ నిధులను మిస్ యూజ్ చేశారని మండిపడ్డారు. వలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకోని రిజిస్టర్ చేశారని మాజీ మంత్రి అఖిల ప్రియ అన్నారు.
క్రీడాకారులకు డబ్బులు ఇవ్వలేదు..
పబ్లిసిటీకి రూ.35 కోట్లు స్టిక్కర్‌లకు, సోషల్ మీడియాకు, హోర్డింగ్‌లకు ఖర్చు చేశారని మాజీ మంత్రి అఖిల ప్రియ చెప్పారు. గెలిచిన క్రీడాకారులకు రూ. 12 కోట్లు అకౌంట్లలో వైసీపీ ప్రభుత్వం వేయలేదని గుర్తుచేశారు. విశాఖపట్నంలో క్లోజింగ్ సెర్మనీ పెట్టి ముందు రూ. 2 కోట్లు అని ఆ తర్వాత.. మరో రూ.3 కోట్లు శాంక్షన్ చేసి ప్రైవేటు సెక్యూరిటీని పెట్టారని అన్నారు. విలేజ్ సచివాలయాల్లో 15000 సచివాలయాలు పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది చూడటానికి వచ్చారని చెప్పారు. విశాఖపట్నంలో 35 వేల మంది ఆడియన్స్‌తో కార్యక్రమం చేస్తే అప్పటి సీఎం జగన్ రాలేదని చెప్పారు. విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసిన వారు ఎంత మందిని ప్రశ్నించారు. ఆ వివరాలపై సంబంధిత అధికారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అడిగితే.. ఆ వివరాలు డిలీట్ చేశారని అధికారులు చెప్పారని అన్నారు. రూ.400 కోట్ల రూపాయలు దీనిలో స్కాం జరిగిందని తెలిపారు. దీనికోసం జిల్లాల నిధులను కూడా ఈ కార్యక్రమానికి వాడారని తెలుస్తోందని అఖిల ప్రియ అన్నారు.
క్రీడాకారులను అపహస్యం చేశారు: ఎమ్మెల్యే గౌతు శిరీష
అసెంబ్లీలో ఈ రోజు(సోమవారం) ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర’పై చర్చ జరిగింది. పలాస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనే కార్యక్రమం పెట్టి క్రీడాకారులను అపహస్యం చేశారని అన్నారు. ఎన్నికల ముందు యువతను ప్రలోభ పెట్టేందుకు ఈ కార్యక్రమం తెచ్చారని ఆరోపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో విజేతలను ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేకపోయారని మండిపడ్డారు. నాణ్యత లేని కిట్లు, క్రీడా పరికరాలు, రవాణా చార్జీలు, భోజన వసతి పేరుతో కోట్లకు పైగా కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ ముగింపు కార్యక్రమాలకు వీఐపీలపేరుతో కోట్లు ఖర్చు చేశారని అన్నారు.సీఐడీ విచారణ ఒక్కరోజు మాత్రమే జరిగిందని తెలిపారు. అధికార పక్షం అవినీతిపై ప్రజల ముందు పెట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్ చేశారు.
‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో యువత జీవితాలతో ఆడుకున్నారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
అసెంబ్లీలో ఈ రోజు(సోమవారం) ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర’పై చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. రాష్ట్ర యువత జీవితాలతో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిలు ఆడుకున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. వైసీపీ అగ్రనేతల ఆధ్వర్యంలో అవినీతికి బరితెగించారని చెప్పారు. దీనివెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉందని విమర్శలు చేశారు. 120 మంది బ్రాండ్ అంబాసిడర్‌లు ఈ క్రీడలకు నియమించారని తెలిపారు. వారు ఎవరు, వారి అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికోట్లు పెట్టి ‘ఆడుదాం ఆంధ్ర’ కోసం క్రీడాకారులకు కావాల్సిన మెటీరియల్స్ కొన్నారు.. అవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందితో ఈ ఆటలు ఆడించారని విమర్శించారు. సరిగ్గా ఎన్నికల ముందు యువతను ప్రలోభ పెట్టే కార్యక్రమం చేశారని మండిపడ్డారు. ‘ఆడుదాం ఆంధ్ర’ కోసం ఎన్ని టీంలు వచ్చాయి, ఎంత మంది ఆడారు, పారితోషికం ఎంతో చెప్పాలని నిలదీశారు. ప్రజా సొమ్మును కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Twists in TG Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయం.. కలిసొచ్చేదెవరికి
BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
Read Latest AP News And Telugu News