AP Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 21 , 2025 | 09:50 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారంలోపు తిరిగి రావాలని హెచ్చరించారు. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
రేపు (సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద దాదాపు మొదటి హెచ్చరిక స్థాయి వరకు చేరనుందని పేర్కొన్నారు. నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
పల్నాడు జిల్లాలో భారీ వర్షం..
మరోవైపు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇవాళ(ఆదివారం) భారీ వర్షం కురిసింది. దీంతో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాగన్నకుంట, సుందరయ్య కాలనీలు నీట మునిగాయి. వాన కురుస్తోండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం పడుతుండటంతో పలు కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. సత్తెనపల్లి - నరసరావుపేట రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. వాన కురుస్తోండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ప్రత్తిపాడు వద్ద రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు - పర్చూరు మధ్య రాకపోకలకు అంతరాయం నెలకొంది.
విజయవాడలో భారీ వర్షం..
విజయవాడలో కుండపోతగా వర్షం పడుతోంది. పాతబస్తీ, భవానిపురం, లో బ్రిడ్జి, జమ్మి చెట్టు, మొగల్ రాజపురం ఎన్టీఆర్ సర్కిల్‌తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాన ధాటికి నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. వర్షం కారణంగా దసరా ఉత్సవాలకు, విజయవాడ ఫెస్టివల్ ఏర్పాట్లకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం బ్యారేజికు వరద ఉధృతి
ప్రకాశం బ్యారేజికు వరద ఉధృతి పెరుగనుంది. నాగార్జున సాగర్ గేట్లు అన్ని ఎత్తి పులిచింతలకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్‌కు 3 లక్షల 45 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇవాళ(ఆదివారం) రాత్రికి పులిచింతల ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు అన్ని ఎత్తి సముద్రంలోకి 3 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉదృతి మరింత పెరుగనుంది. ఆదివారం సాయంత్రం నుంచి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం
కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News