Share News

Rain Alert on AP: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:44 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 27వ తేదీకి తుపానుగా బలపడనుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకి పలు సూచనలు చేశారు.

Rain Alert on AP: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Rain Alert on AP

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 27వ తేదీకి తుపానుగా బలపడనుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangapudi Anitha) ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అల్పపీడనం నైరుతి, పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఈ నెల27వ తేదీకి తుపానుగా బలపడుతుందని తెలిపారు ఎండీ ప్రఖర్ జైన్.


తుపాను తీవ్రతను అంచనా వేయాలి: అనిత

anitha-home-minister.jpg

ఏపీకి రేపు(శనివారం) భారీ, ఎల్లుండి(ఆదివారం) అతి భారీ, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన (Heavy Rains) ఉందని వివరించారు అధికారులు. తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలర్ట్ చేయాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడూ అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని మార్గనిర్దేశం చేశారు. సహయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్(SDRF), ఎన్డీఆర్‌ఎఫ్(NDRF) బృందాలు పంపించాలని సూచించారు హోంమంత్రి వంగలపూడి అనిత.


క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలని మార్గనిర్దేశం చేశారు. భారీ వర్షాలపై సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని కోరారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు -112, 1070, 18004250101 సంప్రందించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులని ఆదేశించారు హోంమంత్రి వంగలపూడి అనిత.


అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారం అందించాలని నిర్దేశించారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. బలమైన ఈదురుగాలుల వీచేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని సూచించారు. భారీవర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 08:53 PM