Kurnool Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:10 PM
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కర్నూలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా (Kurnool Dist)లో ఇవాళ(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సు ప్రమాద ఘటన (Bus Incident) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించిన వి.కావేరి ఏసీ స్లీపర్ ట్రావెల్స్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బైక్ ఢీకొనడంతో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో మొత్తం 19 మంది ప్రయాణికులు, ఒక బైకర్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి పేరు శివశంకర్‌గా తెలుస్తోంది. శివశంకర్ కర్నూలు పట్టణంలోని ప్రజానగర్‌కి చెందిన వ్యక్తి. శివశంకర్ మృతిచెందాడని సమాచారం అందిన వెంటనే ఆయన కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఈ సందర్భంగా శివశంకర్ కుటుంబ సభ్యులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. శివశంకర్ గ్రానైట్ పనికి వెళ్తాడని, నిన్న(గురువారం) రాత్రి ఇంటికి వచ్చాడని తల్లి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున పనికోసం వెళ్లాడని తెలిపింది. తన పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానని శివశంకర్ చెప్పాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గ్రానైట్ పనులతో పాటు పెయింటింగ్ పనులకి కూడా రోజూవారీ కూలిగా వెళ్తాడని శివశంకర్ సోదరుడు చెప్పాడు. శివశంకర్ ఎక్కువగా గ్రానైట్ పనులకి పల్సర్ బైక్ పైనే వస్తుండేవాడని గ్రానైట్ యజమాని తెలిపారు. ఆ బైక్‌నే శివశంకర్ వినియోగిస్తుంటాడని గ్రానైట్ యజమాని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం
Read Latest AP News And Telugu News