Lokesh Invites Industrialists: సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:35 PM
విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను లోకేష్ ఆహ్వానించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని వెల్లడించారు.
అమరావతి, అక్టోబర్ 24: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆస్ట్రేలియా పర్యటన ఆరవ రోజుకు చేరుకుంది. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో మంత్రి పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ సంస్థలు, యూనివర్సిటీ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. తాజాగా మెల్‌బోర్న్‌లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
‘మాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్’ అంటూ పేర్కొన్నారు. ఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే అని చెప్పుకొచ్చారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని మంత్రి వెల్లడించారు.
అంతకు ముందు ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని అన్నారు. $2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
Read Latest AP News And Telugu News